బాధిత వర్గాల అభియోగాల మేరకు ఓ హత్య కేసుకు సంబంధించి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి లేదా ఓ అనుమానాస్పద మృతికి సంబంధించి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి ఆయనపై ! కానీ వాటి గురించి మాట్లాడేంత తీరిక కానీ ఓపిక కానీ దర్యాప్తు బృందాలకు లేవు. కొన్నిసార్లు అవి నిశ్శబ్దం పాటిస్తున్నాయి. కొన్ని సార్లు అవి పెద్దగా బాధిత వర్గానికి అండగా ఉండడం లేదు. ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ డ్రైవర్ మరణంపై ఉన్న మిస్టరీ వీడ లేదు. ఏ కారణంతో ఆయన చనిపోయారు అన్నది తెలియరావడం లేదు. ఎమ్మెల్సీ కారులో ఆయన మృతదేహం ఎందుకు ఉన్నదో కూడా తెలియ రావడం లేదు.
అంతా అస్పష్టంగానే ఉంది. ఏం చేయాలో ఏం చెప్పాలో తెలియక ఓ వైపు ఖాకీలు తలలు పట్టుకుంటున్నారు. తీవ్ర రాజకీయ ఒత్తిళ్లయితే ఉన్నాయి. మరోవైపు బాధిత వర్గాలతో కొన్ని సంతకాలు పోలీసులు నిన్నటి వేళ చేయించుకున్నారు అన్న ఆరోపణ వస్తుంటే, ఎమ్మెల్సీ వర్గాల వారు బాధిత వర్గాలతో బేరసారాలు నడిపారన్న వాదనలు కొన్ని వినిపించి దిగ్బ్రాంతికి గురి చేశాయి. ఈ కేసులో ఎవరు దోషి అన్నది తేలేంత వరకూ బాధిత వర్గాలకు పోలీసులు రక్షణ కల్పించాలి. ఇంతవరకూ హోం మంత్రి తానేటి వనిత మాత్రం స్పందించ లేదు అన్న వార్త ఒకటి విపరీతంగా చర్చకు వస్తోంది.
ఇదే సమయంలో కొన్ని దళిత సంఘాలు, ప్రజా సంఘాలు కూడా నిన్నటి వేళ ఆందోళనలు చేపట్టాయి. అయినా కూడా మార్చూరి తంతు మమ అనిపించారు అన్న వాదనా ఉంది. ఈ సమయంలో బాధ్యత గల పోలీసులు వీటిపై మాట్లాడడం కన్నా కేసు దర్యాప్తును వేగవంతం చేయడంపై కనీసం దృష్టి సారించినా మేలు. కేసును పక్కదోవ పట్టిస్తున్నారన్న విపక్ష నేత చంద్రబాబు ఆరోపణలు అయినా తప్పని తేల్చాల్సిన బాధ్యత పోలీసులది మరియు ప్రభుత్వానిది!