ఉత్తర్‌ప్రదేశ్ ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియుడి గొంతు కోసి హత్య చేసింది ఓ మహిళ. అనంతరం.. ఆ మృతదేహాన్ని పడేసేందుకు సూట్‌కేస్‌లో తరలిస్తూ పోలీసులకు చిక్కింది. ఆమెను అరెస్టు చేసిన పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మృతుడిని సంభల్ ప్రాంతానికి చెందిన ఫిరోజ్‌గా గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. నిందితురాలు ప్రీతి శర్మ తన భర్త దీపక్‌ను విడిచిపెట్టి, నాలుగేళ్లుగా ఫిరోజ్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఫిరోజ్‌ను ఆమె పెళ్లిచేసుకోవాలని భావించగా.. అందుకు అతడు నిరాకరించాడు. తనకు దక్కని వాడు ఎవరికీ దక్కకూడదనే అక్కసుతో ఆమె అతణ్ని అంతమొందించాలని పథకం వేసింది.
పక్కా ప్లాన్ ప్రకారం రేజర్‌తో యువకుడి గొంతు కోసి చంపింది. అనంతరం.. మృతదేహాన్ని పడేసేందుకు దిల్లీలోని సీలంపుర్ ప్రాంతంలో పెద్ద సూట్‌కేసు కొనుగోలు చేసి తీసుకెళ్లింది. అనుమానించిన పోలీసులు.. మహిళను అనుసరించారు. సూట్‌కేసులో మృతదేహాన్ని చూసి విచారించగా అసలు విషయం తెలిసింది. ఫిరోజ్.. దిల్లీలో హెయిర్ డ్రెస్సర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.