తెలంగాణాకే తలమానికమైన యాదద్రి శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి వారి ఆలయం వార్షిక బ్రహోత్సవాలకు ముస్తాబవుతోంది. యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు 2023 ఫిబ్రవరి 21న ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు స్వస్తీవాచనంతో ప్రారంభించి మార్చి 3న శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలకు పరిసమాప్తి పలుకనున్నారు. 2023లో నిర్వహించే ఉత్సవాలు, పండుగల తేదీలను ఖరారు చేస్తూ ఆలయ అధికారులు గురువారం టైం టేబుల్ విడుదల చేశారు. స్వయంభూ నారసింహుడి ప్రధానాలయ పునఃప్రారంభం అనంతరం మొదటిసారిగా జరిగే ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. పునర్నిర్మాణంలో భాగంగా స్వామివారి ప్రధానాలయానికి ఉత్తర దిశలో పంచతల రాజగోపురం నిర్మించారు.
ముక్కోటి ఏకాదశి సం దర్భంగా ఆలయ చరిత్రలోనే మొదటిసారి వచ్చే ఏడాది ఉత్తర ద్వారం గుండా స్వామివారు దర్శనమివ్వనున్నారు. 2023 జనవరి 2న ముక్కోటి ఏకాదశి స్వామివారి ఉత్తర ద్వార దర్శనంతోపాటు ఆరు రోజులపాటు స్వామివారి అధ్యయనోత్సవాలను నిర్వహించనున్నారు. జనవరి 27 నుంచి 30 వరకు పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి అధ్యయనోత్సవాలు, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 6 వరకు పాతగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 15 నుంచి 20 వరకు పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి.