భక్తులకు యాదాద్రి దేవస్థానం శుభవార్త చెప్పింది. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సేవలు ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. నిత్య, వార, మాస, వార్షికోత్సవాలలో భక్తులు సులభంగా పాల్గొనేందుకు ఈ సేవలు తీసుకొచ్చినట్లు యాడా తెలిపింది. బ్రహ్మోత్సవాల టికెట్లకు సైతం ఇబ్బందులు కలగకుండా అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. పూజల నిర్వహణలో భక్తుల ఆశయాలకు ఆటంకం కలగకుండా, ఆధ్యాత్మికతను మరింత పెంచేలా విధానాలు అమలు కావాలన్న సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఈ ప్రక్రియను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు సేవలు మరింత సులభతరమయ్యాయి.
‘https://yadadritemple.telangana.gov.in/’ అనే వెబ్‌సైట్‌లో ఈ సేవలను పొందొచ్చు. ఇందులో నిజాభిషేకం (ఇద్దరికి రూ.800, ఒక్కరికి రూ.400), సహస్రనామార్చన రూ.300, శ్రీ సుదర్శన నారసింహహోమం రూ.1,250, స్వామి వారి కల్యానం రూ.1,500, శయనోత్సవం రూ.100, స్వర్ణపుష్పార్చన రూ.600, సుప్రభాత దర్శనం రూ.100 వంటి అనేక సేవలున్నాయి. రాత్రి బసచేసే భక్తుల కోసం కొండ కింద గదులు ఉన్నాయి. లక్ష్మీ నిలయం నాన్ ఏసీకి రూ.560, లక్ష్మీనిలయం నాన్ ఏసీ డీలక్స్ రూ.1000గా నిర్ణయించారు.