ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపైకి తెచ్చిన మూడు రాజధానుల అంశాన్ని వదిలిపెట్టేలా లేదు. విశాఖకు పరిపాలనా రాజధాని, కర్నూలుకు న్యాయ రాజధాని, అమరావతికి శాసన రాజధానిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన విషయం తెల్సిందే. వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ హోదాలో వైవీ సుబ్బారెడ్డి నేడు విశాఖలో పర్యటించారు. జీవీఎంసీ కార్పొరేటర్లతో ఆదివారం వైవీ సుబ్బారెడ్డి సమావేశమయ్యారు. విశాఖకు పరిపాలనా రాజధాని రావడం ఖాయమని స్పష్టం చేశారు వైవీ సుబ్బారెడ్డి.
న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాక పరిపాలనా రాజధాని వస్తుందని వెల్లడించారు వైవీ సుబ్బారెడ్డి. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ఉంటుందని తెలిపారు. వార్డుల వారీగా అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తామని తెలిపారు వైవీ సుబ్బారెడ్డి. ఇక, గోదావరి వరదలు, విపక్షాల విమర్శలపైనా వైవీ స్పందించారు. కేవలం ఉనికి కోసమే గోదావరి వరదలపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు.