భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవడమే కాదు.. ఖమ్మం జిల్లాతో పాటు అన్ని కరువు ప్రాంతాలకు గోదావరి నీటిని అందిస్తాం అని స్పష్టం చేశారు. సీతారామ ప్రాజెక్టు త్వరలోనే పూర్తవుతుందని, కృష్ణా నదిలో సరిపడా నీరు లేకపోయినప్పటికీ, సీతారామ ప్రాజెక్టు పూర్తయితే నాగార్జున సాగర్ ఆయకట్టుకు ఢోకా ఉండదన్నారు సీఎం కేసీఆర్. ఖమ్మం జిల్లా యావత్ సస్యశ్యామలంగా ఉండబోతుందని, భద్రాద్రి దేవాలయానికి సమీపంలో సీతమ్మ ఆనకట్ట కట్టుకుంటున్నామన్నారు సీఎం కేసీఆర్. 37 టీఎంసీల నిల్వతో ఒక సముద్రాన్ని తలపించే విధంగా తయారు కాబోతుంది అని తెలిపారు కేసీఆర్. కొత్తగూడెం పట్టణం నుంచి ప్రవహించే ముర్రెడు వాగును కోత నుంచి కాపాడుకుంటాం అని కేసీఆర్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. సింగరేణిలో జర్నలిస్టు సోదరులకు ఇండ్ల స్థలాలు ఇప్పిస్తాం.
కొత్తగూడెం జిల్లాలోని 481 గ్రామపంచాయతీలు ఉన్నాయి. చాలా వరకు ఏజెన్సీ పంచాయతీలు ఉన్నాయి. అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నాయి. గోదావరికి అవతల ఉన్న ప్రాంతంలోని వారికి 3 ఫేజ్ కరెంట్ కల్పించాం. గ్రామపంచాయతీల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి గ్రామానికి రూ. 10 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నాం. ప్రజా కార్యక్రమాల కోసం నిధులను వినియోగించాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లందు, మణుగూరు మున్సిపాలిటీలు ఉన్నాయి. పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీల్లో జనాభా అధికంగా ఉంది. ఈ రెండు మున్సిపాలిటీలకు రూ. 40 కోట్ల చొప్పున, మిగతా రెండింటికి రూ. 25 కోట్ల చొప్పున ప్రత్యేక ఫండ్ మంజూరు చేస్తున్నాం అని ప్రకటించారు కేసీఆర్.