భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర వాయిదా పడింది. ఇవాళ రోదసిలోకి వెళ్లాల్సిన బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌక ఇంజిన్లో వాల్వ్ సమస్య తలెత్తడం వల్ల ప్రయోగాన్ని నిలిపివేశారు. అట్లాస్ రాకెట్లోని అప్పర్ స్టేజ్లో ఆక్సిజన్ వాల్వ్ సమస్య ఏర్పడిందని యూనైటెడ్ లాంఛ్ అలయన్స్ ఇంజినీర్ దిల్లాన్ రైస్ వెల్లడించారు. ఈ ప్రయోగాన్ని తిరిగి ఏప్పుడు చేపడతారనే దానిపై కంపెనీ ఎలాంటి సమాచారం అందించలేదు.
స్టార్‌లైనర్ అభివృద్ధిలో ఎన్నో ఇబ్బందులు తలెత్తాయి. ఇంతకుముందు క్యాప్యూల్ సమస్య కారణంగా కొన్నాళ్లు ఆలస్యం అవడం వంటి రకరకాల సమస్యల వల్ల ఈ ప్రాజెక్టు లాంఛ్లో చాలా సంవత్సరాలు జాప్యం జరిగింది. స్టార్‌లైనర్‌తో మానవసహిత యాత్ర నిర్వహించడం ఇదే మొదటిసారి. ఈ యాత్ర విజయవంతమైతే ఐఎస్‌ఎస్‌కు వ్యోమగాములను చేరవేసే రెండో వ్యోమనౌక అమెరికాకు అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. ఈ పర్యటన విజయవంతమైతే అంతరిక్ష కేంద్రానికి సిబ్బందితో కూడిన మిషన్ల కోసం స్టార్ లైనర్‌ను సర్టిఫై చేసే ప్రక్రియను నాసా ప్రారంభిస్తుంది.