దేశంలో మెల్లగా పెరుగుతున్న టమటా ఫ్లూ కేసులు..! దీనికి వ్యాక్సిన్‌ కూడా లేదే

-

కరోనా వచ్చివెళ్లాక ప్రపంచానికి వైరస్‌ దరిద్రంలా పట్టుకుంది.. ఏదో ఒక దేశంలో ఏదో ఒక వైరస్‌ ఉంటూనే ఉంది. మన దేశంలో కూడా టమోటా ఫ్లూ కేసులో పెరుగుతున్నాయి.. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం.. ఇప్పుడు ఈ వైరస్‌ కేసులు విపరీతంగా పెరగడంతో వైద్యుల్లో ఆందోళన నెలకొంది. ఇది ఎంత విధ్వంసం సృష్టిస్తుందేమో అని భయపడుతున్నారు. ఇంకా ఈ వైరస్‌కు ఇంకా వ్యాక్సిన్ కూడా లేదు. అసలేంటీ వైరస్‌, లక్షణాలు ఎలా ఉంటాయి..?
టమాట ఫ్లూ అనేది ఒక రకమైన వైరస్. ఇదో రకం వేరియంట్. దీన్ని చెయ్యి, నోటి వ్యాధి అని కూడా అంటారు. ఇలా పిలవడం క్యాచీగా లేదు కాబట్టి.. టమాట ఫ్లూ అని పిలుస్తున్నారు. ఎందుకంటే. ఇది సోకిన వారికి చేతులు, నోటికి ఎర్రటి పొక్కులు వస్తాయి. జ్వరం కూడా వస్తుంది. ప్రస్తుతం ఇది రాష్ట్రాలను వణికిస్తోంది.
టమాట ఫ్లూ అనేది అరుదైన వైరల్ ఇన్ఫెక్షన్. ఇది ఇదివరకు ఉన్న చెయ్యి, నోటి వ్యాధికి సంబంధించిన వైరస్‌లలో కొత్త వేరియంట్. ఇది ఎక్కువగా ఏడాది నుంచి ఐదేళ్ల వయసున్న పిల్లలకు సోకుతోంది. ప్రారంభంలో రాష్ట్రాల్లో టమాటా ఫ్లూ కేసులు బయటపడ్డాయి. కేరళలోని కొల్లం జిల్లాలో మొదటి కేసు మే 6, 2022న నమోదైంది. కేరళ ఆరోగ్య విభాగం.. ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఎలా వ్యాపిస్తోందో గమనిస్తోంది. ఇది దేశవ్యాప్తంగా వ్యాపించకుండా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
సెప్టెంబర్‌లో.. అసోంలో 100కి పైగా టమాటా ఫ్లూ కేసులు వచ్చాయి.. వాటిలో ఎక్కువ కేసులు దిబ్రూఘర్ జిల్లాలోని రెండు స్కూళ్లలోనే రావడం గమనార్హం.. దాంతో అక్కడి ఆరోగ్య శాఖ అలర్ట్ అయ్యింది. తాజాగా తమిళనాడు ప్రభుత్వాలు కూడా అప్రమత్త సందేశాలు జారీ చేశాయి.
టమాటా ఫ్లూ అనేది ప్రాణాలు తీసేంత భయంకరమైన వ్యాధి కాదు. అయినా ఇది కోక్స్‌సాకీ వైరస్ A16 (Coxsackie virus A16) అనే వైరస్ ద్వారా వ్యాపిస్తోంది. ఇది వేగంగా వ్యాపించగలదు. ముక్కు, నోరు నుంచి వచ్చే ద్రవాలు, కఫం ద్వారా ఇది ఇతరులకు వ్యాపిస్తోంది. దీని వల్ల స్కూళ్లలో చదువులకు సమస్య వస్తోంది. వ్యాధి సోకిన పిల్లల నుంచి పెద్దవాళ్లకు కూడా ఇది వ్యాప్తిస్తుంది.
ఎవరికైనా చేతులు, నోటిపై దద్దుర్లు, పొక్కులు, కురుపుల వంటివి వచ్చి.. దురదగా అనిపిస్తూ ఉంటే… వెంటనే అప్రమత్తం అవ్వాలి. వేడి చేసి వచ్చిందిలే అని అస్సలు లైట్‌ తీసుకోవద్దు. అవి వచ్చిన వారిని విడిగా ఉంచాలి. విశ్రాంతి తీసుకోనివ్వాలి. ఎక్కువగా గోరువెచ్చని నీరు, ఇతర ద్రవాలు తాగించాలి. జ్వరం తగ్గేందుకు పారాసిటమాల్ వాడొచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు. లక్షణాలను బట్టీ చికిత్స ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతానికి టమాటా ఫ్లూకి మందులు, వ్యాక్సిన్ కూడా లేదు కాబట్టి మరింత జాగ్రత్త అవసరం.

Read more RELATED
Recommended to you

Latest news