ఇప్పటిదాకా పెద్దగా నిధులేమీ లేవు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు గ్రామ పంచాయతీలకు ఏమీ లేవు. అయినా కూడా పన్నుల వసూలు పేరిట కొంతలో కొంత పోగేసుకుని కొన్ని పనులు అయినా చేయాలని, అదేవిధంగా సిబ్బంది జీతభత్యాలు చెల్లించాలని ఆశించిన సర్పంచులకు చుక్కలు కనపడుతున్నాయి. ఒక్క పంచాయతీలు అనే కాదు మండల పరిషత్ లకు సంబంధించి అకౌంట్లు కూడా ఖాళీ అయిపోయాయి. దీంతో వీరంతా ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటున్నారు. ఓ విధంగా నిబంధనలకు విరుద్ధంగా తమకు తెలియకుండా డబ్బులు గుంజుకోవడం క్షమించరాని పని అని సర్పంచులు నిరసన గళం వినిపిస్తున్నారు.
ప్రభుత్వ లక్ష్యాల మేరకు స్థానికంగా నిరసనలు ఉన్నా పన్నులు వసూలు చేస్తే ఇప్పుడిలా తమకు మాట మాత్రం అయినా చెప్పకుండా నిధులు గుంజుకుంటే నిర్వహణ ఎలా చేస్తామని, స్థానిక సంస్థల అధికారాలు అన్నీ జగన్ తన గుప్పిట ఉంచుకుంటే తమకు పదవులు ఉన్నా ఒక్కటే లేకపోయినా ఒక్కటేనని నిరసిస్తూ, ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీరంతా ఉద్యమిస్తున్నారు. త్వరలోనే వీరంతా న్యాయ పోరాటానికి కూడా సిద్ధం అవుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సారథి మరో వివాదంలో ఇరుక్కున్నారు. స్థానిక పాలనకు సంబంధించి పంచాయతీల అభివృద్ధికి సంబంధించి కేంద్రం ఇచ్చిన 1,245 కోట్ల రూపాయలు పక్కదోవ పట్టించారని, వారికి చెప్పాపెట్టకుండా డబ్బులు గుంజుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఆస్తిపన్నుతో సహా పలు పన్నులు వసూలు చేసినా అవి కూడా రాష్ట్ర సర్కారు గుంజుకుంది.
దీంతో దీన్నొక ఆర్థిక నేరంగా పరిగణించాలని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకపక్షంగా నిధులు గుంజుకోవడం సమంజసం కాదని టీడీపీ ఫైర్ అవుతోంది.