క్షణానికో మారు మారే రాజకీయంలో ఓ కొత్త అధ్యాయం ఇవాళ నమోదు కానుంది. ఓ విధంగా స్థిరమయిన ప్రభుత్వాలు మాత్రమే మంచి పాలన అందిస్తాయి అని గతంలో నిరూపణ అయింది. ఆ కోవలో బీజేపీ నేతృత్వంలో కూటమి స్థిరమయిన ప్రభుత్వ ఏర్పాటుకు మహరాష్ట్రలో అడుగులు వేస్తున్నారు. ఇవి ఫలిస్తే.. మళ్లీ ఫడ్నవీస్ ఆర్థిక రాజధాని ముంబైను శాసించవచ్చు. అదేవిధంగా ఇప్పటికే శక్తి లేక నిర్వీర్యం అయిపోయిన ఉద్ధవ్ ఠాక్రే పార్టీ శివసేను ఇంకా పూర్తిగా నిలువరించవచ్చు.
ఇదే సమయంలో రె బల్స్ ను దార్లోకి తెచ్చుకునే వేళ పదవుల పందేరం మొదలుకానుంది.దీన్ని ఎలా పరిష్కరించడం అన్నది దేవేందర్ ఫడ్నవీస్ ముందున్న సిసలు పరీక్ష. సుప్రీం కోర్టు సైతం శాసన సభ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు ఇష్టపడని తరుణాన శివసేన అధినేత ఉద్ధవ్ వేసిన పిటిషన్ విచారణలో ఆసక్తిదాయక వ్యాఖ్యలు చేసింది. రెబల్స్ అనర్హత వేటు విషయమై ఏమీ తేలకుండా బలపరీక్ష నిర్వహించకూడదన్న వాదన ను తోసిపుచ్చింది. శివసేన పిటిషన్ పై అసెంబ్లీ కార్యదర్శికి, ఇంకా సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసి కేసు విచారణను వచ్చే నెల 11కు వాయిదా వేసింది.దీంతో ఉద్ధవ్ ఠాక్రే పూర్తిగా డైలమాలో పడిపోయి కీలక నిర్ణయం ఒకటి నిన్నటి రాత్రి వెలువరించి, పూర్తి గా తన అసక్తతను, అసమర్థతను చాటుకున్నారు.అంకెల ఆటపై ఆసక్తి లేదు అని ఉద్ధవ్ ఠాక్రే నిన్నటి వేళ చెప్పారు. మహారాష్ట్ర సీఎం పదవికి రాజీనామా చేసి, ఇంకాస్త ఉత్కంఠకు తెర దించారు. ఇప్పుడు మిగిలింది బలపరీక్ష. అసెంబ్లీలో గురువారం ఉదయం 11 గంటలకు జరిగే బలపరీక్షలో నెగ్గే వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఒకవేళ బీజేపీ కూటమి ఈ పరీక్షలో నెగ్గితే దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఏదేమయినప్పటికీ అస్థిర రాజకీయాల కారణంగా పాలన స్తంభించడం మినహా కొత్తగా సాధించే ప్రయోజనాలేవీ లేవు అని తేలిపోయింది.
ఈ పరిణామాలను మొదట్నుంచి బీజేపీ తనకు అనుగుణంగా మార్చుకుని, విజయం సాధించే దిశగా అడుగులు వేస్తోంది. సొంత మనుషులే తనను వెన్నుపోటు పొడిచారన్ని ఉద్ధవ్ ఠాక్రే చెప్పినప్పటికీ రెండేళ్ల ఆయన ఒంటెద్దు పోకడల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని విశ్లేషకులు అంటున్నారు. శివసేన సీఎం ఏనాడూ తమకు అందుబాటులో లేరని కూడా పోరుబాట పట్టిన ఎమ్మెల్యేల ఆరోపణ. ఈ తరుణాన కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం ఏ విధంగా స్థిర రాజకీయాలు చేయనుంది.. అందుకు రెబల్ ఎమ్మెల్యేలు ఏ మేరకు సహకరిస్తారు అన్నదే కీలకం.
తిరుగుబాటు ఎమ్మెల్యేలతో ఇప్పటికే బీజేపీ సంప్రతింపులు చేసింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సారథ్యం వహిస్తున్న ఏక్ నాథ్ షిండే వర్గంతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉంది బీజేపీ నాయకత్వం. ఫడ్నవీస్ తన తరఫున తన అధీనంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే స్వతంత్రుల మద్దతు కూడా తప్పని సరి ! ఇప్పుడు ఇవే చర్చకు తావిస్తున్నాయి. ఏ ప్రాతిపదికన రెబల్స్ ను ఒప్పించగలరో అన్నదే ముఖ్యం.