తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే గ్రూప్ -1, ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయగా, తాజాగా మరో నోటిఫికేషన్ విడుదలైంది. మహిళా, శిశు సంక్షేమ శాఖలో 181 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. గ్రేడ్ -1 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్(సూపర్ వైజర్) పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అర్హులైన మహిళ అభ్యర్థుల నుంచి సెప్టెంబర్ 8 నుంచి 29వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. తదితర వివరాల కోసం అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు. ఇదిలా ఉంటే.. ఇటీవల.. ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్‌స్టిట్యూట్‌లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 27 ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 6న ప్రారంభం కానుండగా.. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 29ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. సంబంధిత విభాగంలో ఎంఎస్సీ మరియు పీహెచ్‌డీ (PhD) చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లయ్ చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.57,700 నుంచి రూ.1,44,200 వరకు వేతనం ఉంటుంది. విద్యార్హతలు, వేతనాలకు సంబంధించిన పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. దరఖాస్తుదారుల వయస్సు 21 నుంచి 61 ఏళ్లు ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు.