కె.విశ్వనాథ్‌ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు : అమిత్‌ షా

-

కళాతపస్వి సీనియర్ దర్శకులు కె. విశ్వనాథ్ ఫిబ్రవరి 2వ తారీఖు మరణించడం తెలిసిందే. ఆయన మరణం పట్ల టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంకా సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ కూడా విచారం వ్యక్తం చేశారు. ” సినిమా ప్రపంచంలో కె విశ్వనాథ్ ఒక దిగ్గజం. గొప్పదర్శకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలిగా సినీ లోకంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన తీసిన చాలా సినిమాలు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించాయి అని..ట్వీట్ చేసి ప్రధాని మోడీ సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేశారు. అయితే తాజాగా.. కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్‌ షా కె. విశ్వనాథ్‌ మృతిపట్ల సంతాపం తెలిపారు.

 

ట్విట్టర్‌ వేదికగా ‘ప్రముఖ చిత్రాల దర్శకుడు కె.విశ్వనాథ్‌ గారు శివైక్యం చెందారనే విషాద వార్త అందింది. తన చిత్రాల ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి కృషి చేశారు. ఆయన మరణం తెలుగు సినిమాతో పాటు యావత్ భారత సినిమా లోకానికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.’ అంటూ విచారం వ్యక్తం చేశారు అమిత్‌ షా. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం సంతాపం వ్యక్తం చేశారు. “విశ్వనాథ్‌గారి మరణం తీవ్రవిచారానికి గురిచేసింది. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్‌గారు. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రాలు తెలుగు సినీరంగానికి అసమాన గౌరవాన్ని తెచ్చాయి. తెలుగువారి గుండెల్లో కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారు” అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news