తెలంగాణలో రాజకీయం రణరంగంగా మారిపోయింది. బీఆర్ఎస్, బీజేపీల మధ్య రాజకీయ యుద్ధం తీవ్రమైంది. ఒకరినొకరు చెక్ పెట్టుకోవడానికి వేయని ఎత్తులు లేవు..చేయని రాజకీయం లేదు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం..రెండు పార్టీలు తీవ్ర స్థాయిలో రాజకీయ యుద్ధానికి దిగడం. ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉన్న పేపర్ల లీకేజ్ అంశంపై పెద్ద రచ్చ నడుస్తున్న విషయం తెలిసిందే.
టిఎస్‌పిఎస్‌సి పేపర్లు లీక్ అవ్వడంపై కేసిఆర్ సర్కారుని ప్రతిపక్షాలు గట్టిగా టార్గెట్ చేశాయి. ముఖ్యంగా బిజేపి ఓ రేంజ్ లో బిఆర్‌ఎస్ పార్టీని టార్గెట్ చేస్తుంది. ఇదే క్రమంలో వరుసగా టెన్త్ క్లాస్ ప్రశ్నా పత్రాలు కూడా లీక్ అవ్వడం సంచలనం గా మారింది. యథావిధిగా కాంగ్రెస్, బిజేపి, ఇతర ప్రతిపక్షాలు కేసిఆర్ సర్కారుని టార్గెట్ చేశాయి. ఈ క్రమంలోనే బిఆర్‌ఎస్ ఊహించని విధంగా బండిని టార్గెట్ చేసింది. అలాగే అసలు టెన్త్ పేపర్ల లీక్ చేసేది బండి ఆధ్వర్యంలో జరుగుతుందని సంచలన ఆరోపణలు వచ్చాయి.
బండితో పాటు కొందరు కలిసి కావాలని పేపర్లని లీక్ చేసి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని చూశారని, కానీ వారి ప్లాన్ రివర్స్ అయిందని బిఆర్‌ఎస్ నేతలు అంటున్నారు. అయితే ఈ పేపర్ల లీకులో కుట్ర దాగి ఉందని, ఆ కుట్రకు కారణం బండి, ప్రశాంత్, ఇంకా పలువురుని ముద్దాయిలుగా చేసి పోలీసులు కేసు పెట్టారు. ఇక ఏ1 గా బండిని పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు.
ఇక బండి అరెస్ట్ చేయడంపై బిజేపి ఫైర్ అవుతుంది..రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తుంది..ప్రశ్నించే వారి గొంతు నొక్కుతుందని ఫైర్ అవుతున్నారు. అటు బిఆర్‌ఎస్ నేతలు కూడా వరుసగా బిజేపి కుట్ర అని, బండి దుర్మార్గుడు అంటూ విరుచుకుపడుతున్నారు. ఇలా రెండు పార్టీల మధ్య రాజకీయ యుద్ధం నడుస్తోంది.
అయితే ఇదంతా బిజేపి, బిఆర్‌ఎస్ ఆడుతున్న గేమ్ అని, అసలు పేపర్ల లీక్ అంశాన్ని పక్క దారి పట్టించడానికి, రాష్ట్రంలో సమస్యలని డైవర్ట్ చేయడానికి రెండు పార్టీలు చేస్తున్న రాజకీయం అని కాంగ్రెస్ అంటుంది. కానీ ఏం జరుగుతుందో గాని మొత్తానికి బిఆర్‌ఎస్, బిజేపిల మధ్య రాజకీయ యుద్ధం ముదిరింది.