రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, గురువారం నాగర్‌కర్నూల్ మండల, మున్సిపల్ బీఆర్ఎస్(BRS) ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అక్కడ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసి బీజేపీ పాలిత రాష్ట్రాలు సిగ్గుపడుతున్నాయని అన్నారు. 60 ఏళ్ల పాటు కాంగ్రెస్, తొమ్మిదేళ్లపాటు అధికారంలో ఉన్న బీజేపీ అభివృద్ధిని పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని తట్టుకోలేక బీజేపీకి తెలంగాణపై కన్ను పడి తెలంగాణ పై వారు తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారని వెల్లడించారు మంత్రి మల్లా రెడ్డి.
ఇంతకుముందు పాలించిన టీడీపీ సైతం ఏమాత్రం అభివృద్ధి చేపట్టలేకపోయిందని హేళన చేశారు మంత్రి మల్లారెడ్డి.తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలన లో చేపట్టిన అభివృద్ధితో అన్ని జాతీయ పార్టీలు కనుమరుగయ్యయని పేర్కొన్నారు ఆయన. నాగర్ కర్నూల్లో మెడికల్ కళాశాల, అగ్రికల్చర్ కళాశాల, అందమైన మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం గొప్ప విషయమని పొగిడారు. ఎమ్మెల్యే జనార్ధన్‌రెడ్డికి ప్రజలు మరోసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ శ్రేణులకు, నియోజకవర్గ ప్రజలను కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే జనార్ధన్‌రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.