రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

-

రాష్ట్రంలో జరుగుతున్న ఘోరాలు, నేరాలపై రాష్ట్ర ప్రజలకు నారా చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాశారు. వైసీపీ పాలనలో రాష్ట్రం నేరాంధ్ర ప్రదేశ్ గా మారిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. బాపట్ల జిల్లాలో బాలుడి సజీవ దహనం సహా పలు అంశాలను ప్రస్తావిస్తూ లేఖ రాశారు చంద్రబాబు. సిఎం వైఖరి, ప్రభుత్వ అసమర్థత నేరగాళ్లకు మరింత ఊతం ఇచ్చేలా ఉందంటూ లేఖలో పేర్కొన్నారు. గత మూడు రోజుల్లో జరిగిన నాలుగు అంశాలు ప్రస్తావిస్తూ రాష్ట్ర పరిస్థితి పై ప్రజలు ఆలోచన చేయాలి అని కోరిన చంద్రబాబు.. మహిళలకు భద్రతలేదు, ఆస్తులకు రక్షణ లేదు, చట్ట సభల్లో గౌరవం లేదు, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అంటూ నాలుగు అంశాలు పేర్కొన్నారు.

 

AP total debt burden reached Rs 10.31 lakh cr, says Chandrababu

అంతేకాకుండా.. ‘బాపట్ల జిల్లాలో అభంశుభం తెలియని ఒక బాలుడిని అత్యంత పాశవికంగా సజీవ దహనం చేసిన ఘటన నన్ను ఎంతగానో కలిచివేసింది. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు,వైసీపీ నేతల భూకబ్జాలు, నేరగాళ్ల విశృంఖలత్వం, బిల్లులు రాక కాంట్రాక్టర్ల ఆత్మహత్యలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. గంజాయి, గన్ కల్చర్ అడ్డులేకుండా వ్యాపిస్తున్నాయి. నవ్యాంధ్ర ప్రజలు జగన్ రెడ్డి పాలనలో ప్రతిరోజు అనుభవిస్తున్న నరక యాతన చూసి ఎంతో ఆవేదనతో ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేదు అనడానికి బాలుడి సజీవ దహనం పెద్ద ఉదాహరణ. బాపట్ల బాలుడి సజీవ దహనం రాష్ట్రం మొత్తాన్ని నివ్వెర పాటుకు గురిచేసింది. బంగారు భవిష్యత్ ఉన్న బిడ్డ…దుర్మార్గుల దాడిలో ఇలా కాలి శవమై ఇంటికి రావడాన్ని ఏ తల్లి అయినా ఎలా భరించగలుగుతుంది? తండ్రి లేని ఆ కుటుంబంలో తన సోదరికి అండగా ఉండడమే ఆ బాలుడు చేసిన తప్పా? మహిళలపై వేధింపులు జరుగుతుంటే కఠిన చర్యలు తీసుకోని జగన్ రెడ్డి ప్రభుత్వ విధానాలు ఇలాంటి ఘటనలకు ఊతం ఇవ్వడం నిజం కాదా?

 

ఆడబిడ్డ జోలికి వెళ్లాలి అంటే భయపడే పరిస్థితి రాష్ట్రంలో ఉండి ఉంటే.. అక్కకు అండగా నిలిచిన ఆ బాలుడి ప్రాణాలు పోయేవి కాదు కదా? బలహీన వర్గాలకు చెందిన ఆ బాలుడిని ఇలా మంటల్లో కాల్చేసింది వైసీపీ ప్రభుత్వ వైఫల్యం కాదా? రాష్ట్రంలో ప్రైవేటు ఆస్తుల కబ్జా నిత్యకృత్యం అయ్యింది. దశాబ్దాల పాటు శ్రమించి ప్రజలు సంపాదించుకున్న ఆస్తిని వైసీపీ రాక్షసులు కబ్జా చేస్తున్నారు. అనంతపురంలో తన ఆస్తిని ఆక్రమించుకుంటే ప్రింటింగ్ ప్రెస్ యజమాని వంశీ…కబ్జా దారులను ఎదుర్కొనలేక ప్రాణాలు తీసుకున్నాడు. రాష్ట్రంలో వైసీపీ అక్రమార్కుల సెటిల్మెంట్లు, ప్రజల ఆస్తుల కబ్జాలు, బెదిరింపులు, వేధింపులకు ఈ ఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. చివరికి అతను రాసిన సూసైడ్ నోటును కూడా తారుమారు చేశారు. సూసైడ్ లేఖలో ప్రస్తావించిన వైసీపీ నేత పేరును తొలగించిన పోలీసులు… ఆ కుటుంబానికి మరింత ద్రోహం చేశారు. రాష్ట్రంలో కింది స్థాయి వార్డు మెంబర్ నుంచి రాష్ట్ర మంత్రుల వరకు వ్యవహరిస్తున్నతీరు ప్రజలకు అసహ్యాన్ని కలిగిస్తోంది. అమలాపురంలో మున్సిపల్ చైర్మన్ పై ఏకంగా వైసీపీ కౌన్సిలర్ భర్త దాడికి దిగడం ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరుకు అద్దం పడుతోంది. ఇక పోతే రాష్ట్రంలో అధ్వాన్న శాంతి భద్రతలకు నిదర్శనం విశాఖలో జరిగిన కిడ్నాప్ వ్యవహారం. ప్రశాంతమైన ఉత్తరాంధ్రలో జరిగిన అధికార పార్టీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడు, అతని ఆడిటర్‌ కిడ్నాప్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఒక ఎంపి కుటుంబాన్ని కిడ్నాప్ చేసి ఎంపి కుమారుడి ఇంట్లోనే రెండు రోజులు పాటు బందీలుగా పెట్టుకోవడం అందరినీ షాక్ కి గురి చేసింది.’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news