రాష్ట్ర ప్రజల సొమ్ముతో మహారాష్ట్రలో సీఎం కేసీఆర్ సోకులు పడుతున్నారని వైఎస్ ఆర్టీపీ చీఫ్ షర్మిల ఫైరయ్యారు. ప్రభుత్వమంతా పక్క రాష్ట్రంలోనే ఉందని మంగళవారం ఆమె ట్వీట్ చేశారు. కేసీఆర్ తెలంగాణకా, మహారాష్ట్రకా సీఎం అని ఆమె ప్రశ్నించారు. ‘‘ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇక్కడి సంపదను కొల్లగొట్టి పక్క రాష్ట్రంలో కార్లతో ర్యాలీలు తీసి దుబారా ఖర్చు చేస్తున్నారు. వాళ్ల సోకులను ప్రజలు గమనించాలి. ర్యాలీతో పబ్లిక్ ను సీఎం ఎంతో ఇబ్బంది పెట్టిండు. రాష్ట్రంలో సమస్యలు తెలుసుకోలేని బందిపోట్లు పక్క రాష్ట్రాల ప్రజలను ఉద్ధరిస్తామనడం ఈ దశాబ్దపు పెద్ద జోక్. రాష్ట్ర ప్రజలు ఇకనైనా మేల్కోవాలి” అని షర్మిల ట్వీట్ చేశారు. రంగులు మార్చే బీఆర్ఎస్ దొంగలను దేశం నుంచి తరిమికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు.
కాంగ్రెస్, బీజేపీతో స్నేహం విషయంలో కేసీఆర్ అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రుణమాఫీ అని 31 లక్షల మందిని మోసం చేసినందుకు రైతుల టీమ్ అవుతారా? 9 ఏళ్లలో 9 వేల మంది రైతులను పొట్టన పెట్టుకున్న మీరు రైతుల పక్షమా?, వరి వేస్తే ఉరి అని చెప్పినందుకు రైతుల పక్షామా? అని నిలదీశారు. మూడు ఎకరాల భూమి అని దళితులను, రిజర్వేషన్లు పేరుతో మైనారిటీలను, పోడు పట్టాల ఆశ చూపి గిరిజనులను, జనాభాలో అగ్రస్థానంలో ఉన్న బీసీలను అణగదొక్కి మోసం చేశారని విమర్శలు గుప్పించారు. మీది ప్రజల పక్షం కాదు. ప్రజలను దోచుకు తినే దొంగల పక్షం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మగౌరవం పేరు చెప్పి.. తన్ని తరిమేస్తరన్న చోటే రాజకీయం చేసే మీరు.. తెలంగాణ ప్రజల పక్షం అంటే నమ్మెంత పిచ్చోళ్లు ఎవరు లేరని దుయ్యబట్టారు.