వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని ఆరాట పడుతున్న రాజకీయ నాయకులు ఓటు బ్యాంక్ అధికంగా ఉన్న సామాజిక వర్గాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఆయా కులాలవారీగా ఓట్లు పట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బీసీ జనగణనకు సిద్ధమవుతోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు తేల్చాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ట్రిపుల్ టెస్ట్ తో కూడిన ప్రశ్నావళిని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. బీసీ కమిషన్ ఈ పనిలో నిమగ్నమైంది. బీసీల్లోనూ కులాల వారీగా రాజకీయ ప్రాతినిధ్యంపై సర్వే చేపట్టనున్నది. చట్ట సభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కేటాయించాలని చర్చ జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బీసీ జనగణనకు ఉపక్రమించడం చర్చనీయాంశంగా మారింది.
బీసీ జనగణన ఆధారంగా గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని వార్డు, డివిజన్, సర్పంచ్, మున్సిపల్ చైర్మన్, మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు బీసీలకు స్థానిక సంస్థల్లో నిర్ణీత రిజర్వేషన్లు లేవు. సర్వేలో బీసీ జనాభా, గ్రామం లేదా మున్సిపల్ డివిజన్ లేదా వార్డులో వెనుకబడిన వర్గాల ఓటర్ల శాతం, విద్యార్హతలు, బీసీలకు లభిస్తున్న ప్రాతినిధ్యం, వారి ఆర్థిక స్థితి తదితర ప్రశ్నలు అడుగుతారని తెలుస్తోంది.
బీసీ జనగణనపై అధ్యయనం చేసేందుకు తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ నేతృత్వంలో సభ్యులు సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్, కే కిషోర్ గౌడ్ నేతృత్వంలోని బృందం కర్నాటకలో పర్యటించింది. రెండు రోజుల పాటు అక్కడే ఉండి బీసీ జనగణన తీరును పరిశీలించింది. ప్రధానంగా బీసీల్లోని చేతి వృత్తుల వారి జీవన స్థితిగతులను విద్యా, రాజకీయ అంశాలను సాంఘిక పరిస్థితిని అక్కడ ఎలా అధ్యయనం చేశారనేది పరిశీలించింది. బీసీ జనగణనకు వారు ఉపయోగించిన ప్రశ్నావళిని పరిశీలించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఎలా పాటించారనేదీ అధ్యయనం చేసింది.