ఎడిట్ నోట్: క్యాపిటల్ వార్..!

-

ఏపీలో రాజధాని అంశంపై రచ్చ నడుస్తూనే ఉంది..వైసీపీ ఏమో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని పట్టుదలతో ఉంది. టీడీపీ ఏమో ఎలాగైనా మూడు రాజధానులకు బ్రేక్ వేసి..అమరావతినే రాజధానిగా కొనసాగేలా చేయాలని చూస్తుంది. గత మూడేళ్లుగా ఏపీలో ఇదే రచ్చ నడుస్తోంది. విడిపోయిన ఏపీకి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీకి రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేశారు. దీనికి అప్పుడు ప్రతిపక్షంలో వైసీపీ కూడా ఒప్పుకుంది.

అయితే ఐదేళ్లలో అమరావతిలో జరిగిన గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు లేవు. కొద్దో గొప్పో పనులు జరిగాయి. ఇక 2019 ఎన్నికల సమయంలో జగన్..రాజధాని మార్పుపై ఎలాంటి ప్రకటన చేయలేదు..పైగా అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నారు. దీంతో రాజధాని మార్పు ఉండదని జనం అనుకున్నారు. ఇక జగన్ అధికారంలోకి వస్తే రాజధాని ఇంకా అభివృద్ధి జరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో జగన్..మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానుల ఏర్పాటు అని చెప్పారు.

అమరావతి ముంపు ప్రాంతమని, ఇక్కడ అభివృద్ధి చేయాలంటే లక్ష కోట్లు అవుతాయని, అలాగే ఇక్కడ టీడీపీ అక్రమాలకు పాల్పడిందని విమర్శలు చేశారు. సరే ఏదొకటి మూడు రాజధానులు పెట్టేస్తారని అంతా అనుకున్నారు. కానీ అమరావతి ఒకటే రాజధానిగా ఉండాలని ఆ ప్రాంత రైతులు, ప్రజలు ఉద్యమం చేస్తూ వస్తున్నారు. అలాగే న్యాయ పోరాటాలు కూడా చేస్తున్నారు. ఇదే క్రమంలో మూడు రాజధానుల బిల్లులో అనేక లోపాలు ఉండటంలో కోర్టులో ఈ బిల్లు నిలబడటం కష్టమే అని భావించి..జగన్ ప్రభుత్వం ఆ బిల్లుని ఉపసంహరించుకుంది.

అలాగే మళ్ళీ కొత్తగా బిల్లు తీసుకొస్తామని చెప్పింది. ఇక బిల్లు తీసుకురాలేదు గాని..అప్పుడప్పుడు వైసీపీ నేతలు మాత్రం..త్వరలోనే మూడు రాజధానులు ఏర్పాటు అవుతాయని ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా అమరావతి రైతులు…శ్రీకాకుళంలోని అరసవెల్లి వరకు పాదయాత్ర చేపట్టారు. దీంతో ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు..తమదైన శైలిలో పాదయాత్రపై విమర్శలు చేస్తున్నారు. ఎట్టి పరిస్తితుల్లోనూ ఈ పాదయాత్రని అడ్డుకుంటామని అంటున్నారు. అటు ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ఏమో…పాదయాత్రకు మద్ధతుగా ఉంటామని, ఏపీకి అమరావతి ఒకటే రాజధాని అని చెబుతున్నారు.

ఇలా రెండు పార్టీల మధ్య రాజధాని విషయంలో రగడ నడుస్తోంది. ఇదే తరుణంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఖచ్చితంగా మూడు రాజధానుల గురించి చర్చ జరగడం ఖాయం. అలాగే దీనిపై సీఎం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. ఇక చంద్రబాబు లేకుండానే టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు.

ఇక ఎలాగో టీడీపీ వాళ్ళకు అసెంబ్లీలో పెద్దగా మాట్లాడే స్కోప్ ఉండదు. అలాగే ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే న్యాయ పరమైన చిక్కులు లేకుండా మూడు రాజధానుల బిల్లుని జగన్ ప్రభుత్వం తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒకవేళ బిల్లు తీసుకొస్తే మళ్ళీ కోర్టులో నిలబడుతుందో లేదో చూడాలి. మొత్తానికైతే ఎన్నికల వరకు ఈ రాజధాని రచ్చ జరిగేలా ఉంది. ఎన్నికల్లో వైసీపీ మూడు రాజధానులు రిఫరెండంగా, టీడీపీ అమరావతి రిఫరెండంగా ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. మరి చివరికి ప్రజలు ఎవరికి మద్ధతు నిలబడతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news