ఎడిట్ నోట్: రాజకీయ ‘రైడ్స్’..ఎవరికి ప్లస్.!

-

అవినీతి, అక్రమాలు, ప్రలోభాలు, ట్యాక్స్ కట్టని వారిపై చర్యలు తీసుకోవాల్సిన దర్యాప్తు సంస్థలు..అధికార పార్టీల చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోయాయనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే సీబీఐ, ఈడీ, ఐటీ లాంటి సంస్థలని వాడి, ప్రత్యర్ధులకు చెక్ పెట్టడం, రాష్ట్ర ప్రభుత్వాలని పడగొట్టి బీజేపీ అధికారం చేపట్టడం లాంటి కార్యక్రమాలు చేస్తుందని ప్రత్యర్ధులు విమర్శిస్తూనే ఉన్నారు.

ఇదే క్రమంలో తెలంగాణలో తమకు ప్రత్యర్ధిగా ఉన్న టీఆర్ఎస్ పార్టీని బీజేపీ టార్గెట్ చేసి..ఈడీ, ఐటీ సంస్థలని వాడి టీఆర్ఎస్‌ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తుందని విమర్శలు వస్తున్నాయి. అయితే ఇందులో రెండువైపులా ఆలోచించాల్సిన విషయాలు ఉన్నాయి. ఆ సంస్థల ద్వారా..అక్రమాలు చేసిన వారు, ఐటీ ఎగొట్టిన వారినే టార్గెట్ చేస్తున్నారని, తప్పు చేయకపోతే భయపడటం ఎందుకని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కాదు కాదు..తమని బీజేపీలోకి లాగడానికి ఇలా ఈడీ, ఐటీలని వాడుతున్నారని, అలాగే ఆర్ధిక మూలాలని దెబ్బకొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, అయినా ఈడీ, ఐటీలకు భయపడే ప్రసక్తి లేదని చెప్పి టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇక ఎవరి వర్షన్ వారికి ఉంది.

కాకపోతే ఇదివరకు ఐటీ, ఈడీ దాడులు జరిగితే..ఏమి జరిగిందో, నగదు ఎంత సీజ్ చేశారో చెప్పేవారు. కానీ ఇప్పుడు మీడియాలో ఎవరికి వారు నచ్చినట్లు వేసేస్తున్నారు. క్యాసినో వ్యవహారంలో టీఆర్‌ఎస్‌ నేతల ప్రమేయానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు బయటకు రాలేదు. ఇక మంత్రి మల్లారెడ్డి, గంగులపై ఐటీ, ఈడీ జరిపిన దాడుల్లో కూడా ఇప్పటివరకు ఆయా దర్యాప్తు సంస్థలు ఏమీ చెప్పకుండా వెళ్లిపోవడంపై అనుమానాలు వస్తున్నాయి.

ఇదంతా కక్ష పూరితంగానే జరిపిస్తున్న దాడులు అనే విమర్శలకు ఊతమిస్తున్నాయి. బీజేపీ వైపు ఉంటే ఈ దాడులు ఉండవని, లేదంటే దాడులు తప్పవనే విధంగా రాజకీయం నడుస్తోంది. ఉదాహరణకు గతంలో టీడీపీలో ఉన్న సిఎం రమేష్‌, సుజనా చౌదరిలు కోట్లలో బ్యాంకులకు బాకీ పడ్డారు. రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొన్న ఈ నేతలు బీజేపీలో చేరిన తర్వాత ఆ కేసులు అటకెక్కాయన్న వాదన కూడా ఉంది. ఈ అంశాన్ని కేటీఆర్ పలుమార్లు ప్రస్తావించారు కూడా.

ఇక ఇటు వస్తే రాష్ట్రంలో ఉండే అధికార సంస్థలని వాడి టీఆర్ఎస్..ప్రత్యర్ధులని దెబ్బతీస్తుందనే విమర్శలు ఉన్నాయి. ఇందులో భాగంగానే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తెరపైకి వచ్చిందని బీజేపీని ఇరుకున పెట్టడానికే సిట్ ఏర్పాటు చేశారని అంటున్నారు. సిట్ మాత్రమే కాదు రాష్ట్రంలో అధికార వ్యవస్థలని టీఆర్ఎస్ వాడుకుని, ప్రత్యర్ధులని ఇబ్బంది పెడుతుందనే విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. అంటే ఎవరికి వారు..అధికార సంస్థలని ప్రత్యర్ధులని దెబ్బతీయడానికి ప్రయోగిస్తున్నారు. ఇక ఇందులో రాజకీయ కక్ష తప్ప మరొకటి కనబడటంలేదు. మరి వీటిల్లో ఎవరికి ప్లస్ అవుతుంది..ఎవరికి మైనస్ అవుతుందనేది భవిష్యత్‌లో ప్రజలే నిర్ణయిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news