టీడీపీ చేస్తున్న అక్రమాలను, అవినీతిని వైకాపా ఎప్పటికప్పుడు బయటపెట్టి అందులో సక్సెస్ అయింది. కానీ జనసేన మాత్రం టీడీపీని విమర్శించకుండా, టీడీపీ నేతల జోలికి వెళ్లకుండా, ప్రజా సమస్యలపై సరిగ్గా స్పందించకుండా కాలక్షేపం చేసింది. దీంతో ప్రజలు ఆ పార్టీని దూరం పెట్టారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రజలు వైసీపీకి పట్టం కట్టారు. 151 సీట్ల భారీ మెజారిటీని అందించి జగన్‌ను సీఎంను చేశారు. ఈ క్రమంలోనే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కనీ వినీ ఎరుగని రీతిలో టీడీపీ దారుణ పరాజయాన్ని చవిచూసింది. అలాగే మరోపార్టీ జనసేన అంతకన్నా దారుణంగా ఓడిపోయింది. ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన అసలు ఏ మాత్రం పోటీనివ్వలేకపోయింది. పవన్ తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి పాలయ్యారు. ఇక ఆయన పార్టీకి కేవలం ఒక అసెంబ్లీ సీటు మాత్రమే దక్కింది. అయితే టీడీపీ ఓటమిని అందరూ ముందే ఊహించారు. కానీ జనసేన ఇంత దారుణంగా ఓడుతుందని ఎవరూ అనుకోలేదు. ఆ పార్టీకి కనీసం 20 స్థానాలు వస్తాయని కూడా అంతా భావించారు. కానీ అంచనాలు తారుమారయ్యాయి. అయితే జనసేన అంతటి ఘోర పరాజయం పాలవ్వడానికి గల కారణాలు ఏమిటా.. అని ఒకసారి విశ్లేషిస్తే…
జనసేన పార్టీ 2014లో టీడీపీ, బీజేపీలకు మద్దతిచ్చింది. 2019 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసింది. అయితే 2014 నుంచి 2019 వరకు జనసేనకు 5 సంవత్సరాల సమయం దొరికింది. అయినా.. ఆ పార్టీ నిర్మాణంపై అధినాయకత్వం దృష్టి పెట్టలేదు. 5 ఏళ్ల కాలాన్ని వారు సద్వినియోగం చేసుకోలేదు. ఈ క్రమంలో ఎన్నికలు రాగానే హడావిడిగా పోటీ చేశారు. అంతేకానీ క్షేత్ర స్థాయిలో ఓటర్లలో నమ్మకం కలిగించే ప్రయత్నం చేయలేదు. మరోవైపు వైకాపా మాత్రం అనునిత్యం జనంలోనే ఉంది. ఆ పార్టీ నేత జగన్ పాదయాత్రతో ప్రజలకు దగ్గరయ్యారు. ఏపీలో ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా ఆయన స్పందించారు. ఆ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్ష పార్టీగా వైకాపా మారింది. అలాగే టీడీపీ చేస్తున్న అక్రమాలను, అవినీతిని వైకాపా ఎప్పటికప్పుడు బయటపెట్టి అందులో సక్సెస్ అయింది. కానీ జనసేన మాత్రం టీడీపీని విమర్శించకుండా, టీడీపీ నేతల జోలికి వెళ్లకుండా, ప్రజా సమస్యలపై సరిగ్గా స్పందించకుండా కాలక్షేపం చేసింది. దీంతో ప్రజలు ఆ పార్టీని దూరం పెట్టారు. అందుకనే ఈ ఎన్నికల్లో జనసేనను వారు పట్టించుకోలేదు. వైకాపాకే పట్టం కట్టారు.
ఇక జనసేన ఓడినందుకు గల కారణాల్లో మరొకటి.. పవన్ కు ఓటు వేస్తే ఆయన అధికారంలోకి వస్తారా, రారా అన్న సందేహం ప్రజల్లో వచ్చింది. ఈ క్రమంలో ఒక వేళ తాము పవన్‌కు ఓటు వేస్తే అది వ్యర్థమవుతుందేమోనని వారు భావించారు. అందుకనే వైకాపాకు ఓటు వేసి ఆ పార్టీకి అధికారం ఇచ్చారు. అలాగే చిరంజీవి అప్పట్లో స్థాపించిన ప్రజారాజ్యం ఎఫెక్ట్ కూడా జనసేనపై పడిందని చెప్పవచ్చు. ఆయన 18 ఎమ్మెల్యే సీట్లు గెలిచినప్పటికీ తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఈ క్రమంలో జనసేన కూడా అలా మారుతుందేమోనని జనాలు భావించారు. అందుకనే జనసేనకు ప్రజలు ఓటు వేయలేదు.
అదేవిధంగా జనసేన పార్టీ తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తాము అనే విషయం స్పష్టంగా చెప్పలేదు. కానీ వైకాపా అలా కాదు. ఆ పార్టీ అధినేత జగన్ నవరత్నాలను ప్రవేశపెట్టారు. తాము అధికారంలోకి వస్తే ఏపీ రాష్ట్రాభివృద్ధితోపాటు ప్రజలకు ఏం చేస్తామనే విషయం చాలా స్పష్టంగా మొదట్నుంచీ చెబుతూ వచ్చారు. అందుకనే ప్రజలు వైకాపాను నమ్మారు. అధికారాన్ని కట్టబెట్టారు. అయితే తమ పార్టీ ఓడిపోయినా, తాను ఎమ్మెల్యేగా గెలవలేకపోయినా.. ప్రజాక్షేత్రంలోనే ఉంటానని, ప్రజా సమస్యలపై తన తుదిశ్వాస ఉన్నంత వరకు పోరాడుతానని పవన్ ఇప్పటికే చెప్పారు. మరి రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఆయన పాత్ర ఎలా ఉంటుందో.. వేచి చూస్తే తెలుస్తుంది..!