రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి కొనసాగుతున్నది. నేటితో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగియనున్నది. మరోవైపు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల కానున్నది. ఈ నేపథ్యంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. బీఆర్‌కే భవన్‌లో సీఎస్‌కు రాజీనామా లేఖ సమర్పించగానే వెంటనే ఆమోదం లభించింది. సోమవారం నుంచే పదవీ విరమణ కూడా అమలులో వచ్చింది.
మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డి తొలి నుంచీ రాజకీయ ఆసక్తి కనబరుస్తూ వస్తున్నారు. 2018, అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి ఎంపీ అభ్యర్థిత్వం, దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ టికెట్ ఆశించినా అవకాశం లభించలేదు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల గడువు మంగళవారంతో ముగుస్తుండటం, స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్లు వెలువడనున్న నేపథ్యంలో వెంకట్రామిరెడ్డి రాజీనామా చేయడంతో ఆయనకు పార్టీ అధినేతతో స్పష్టమైన హామీ లభించినట్లు ప్రచారం జరిగింది. ఆయన్ని ఎమ్మెల్సీగా ఎంపిక చేసి, రెవెన్యూ మినిష్టర్‌గా నియమిస్తారనే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈ మేరకు ఎమ్మెల్యే కోటాలో తెరాస అభ్యర్థుల ఖరారు సమయంలో వెంకట్రామిరెడ్డి పేరు చర్చకు రావడం ఇది బలాన్ని చేకూరుస్తున్నది.
తొలి నుంచీ మాజీ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డి సీఎం కేసీఆర్‌కు అండదండలు ఉన్నాయి. దాదాపు ఐదేండ్ల కాలం ఆయన సిద్దిపేట జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. గజ్వేల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు ఎత్తించారు. ఈ విషయమై సీఎం కేసీఆర్ సైతం వెంకట్రామిరెడ్డి ఎన్నోసార్లు ప్రశంసించారు. అలాగే, ఆయన సైతం తన విధేయతను చాటుకుంటూ వస్తున్నారు. సిద్దిపేట నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవ సమయంలో కేసీఆర్‌కు వెంకట్రామిరెడ్డి పాదాభివందనం చేయడం విమర్శలకు తావిచ్చింది. ఇటీవల సిద్దిపేట జిల్లాలో వరి పంటలను సాగు చేయవద్దని, విత్తన సంస్థలు వరి విత్తనాలను సరఫరా చేయవద్దని సైతం ఆయన హెచ్చరించారు.
ఐఏఎస్ పదవికి రాజీనామా చేసిన వెంకట్రామిరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరునున్నట్లు స్పష్టం చేశారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని ప్రశంసించారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి మార్గంలో ఉండాలనుకుంటున్నానని, అందుకే వీఆర్‌ఎస్ తీసుకున్నట్లు తెలిపారు. తాను త్వరలో టీఆర్‌ఎస్‌లో చేరుతానని, సీఎం కేసీఆర్ ఏ పదవి అప్పగించినా పనిచేస్తానని పేర్కొన్నారు.