‘మహర్షి’ సినిమాకు సంబంధించి నిర్మాత దిల్‌రాజు నిన్న ప్రెస్‌మీట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. భారీ బడ్జెట్ సినిమాలకు మామూలు టికెట్ ధరల వల్ల గిట్టుబాటు కావడంలేదని, పైరసీ వల్ల సినిమాలు ఎక్కువరోజలు ఆడకపోవడంతో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు తీవ్రంగా నష్టపోవాల్సివస్తుందన్నారు. ఈ కారణం చేతనే విడుదలైన కొన్నిరోజులపాటు టికెట్ ధర పెంపుదల సబబే అని ఆయన సెలవిచ్చారు. ఇంతకీ బడ్జెట్ ఎందుకు పెరిగినట్లు? ప్రేక్షకులు ఎక్కువ డబ్బులు ఎందుకివ్వాలో..
మహేశ్‌బాబు సినిమా ‘మహర్షి’, ఆనందోత్సాహాల మధ్య నేడు విడుదలైంది. సినిమా బాగానే ఉందని, కాకపోతే కొంచెం లెంత్ ఎక్కువయిందని సమాచారం. ఓకే… ఇప్పుడు హీరో హ్యాపీ..ఫ్యాన్స్ ఖుష్ అయినందుకు, నిర్మాత హ్యాపీ..డబ్బులు బాగా వస్తాయి కనుక, , దర్శకుడు హ్యాపీ..తనకు మార్కెట్ మరింత పెరిగినందుకు, ఎగ్జిబిటర్లు కూడా హ్యాపీ.. కోట్లు పోసి కొన్నందుకు బాగానే గిట్టుబాటు అవుతున్నందుకు… ఎటొచ్చీ మునిగిందెవరయ్యా.. అంటే… ఇంకెవరు? నన్‌అదర్ దాన్ సగటు ప్రేక్షకుడు.
ఈ ‘భారీ’ బడ్జెట్ చిత్రాన్ని ముగ్గురు ఉద్దండపిండాలు కలిసి నిర్మించారు. దిల్‌రాజు, అశ్వనీదత్, పివీపి. సరే.. పేర్లు మూడు కనబడుతున్నా, ఒకేఒక్కడు హ్యాండిల్ చేసాడు. అయనే దిల్ రాజు. తనకుతాను తనను మించిన నిర్మాత లేడనుకుంటాడు. అసలు సినిమా అంటే ఏంటో, సినిమా బిజినెస్ అంటే ఏంటో.. ఇండియాలో తనకు తప్ప ఎవరికీ తెలియదని ఆయన ప్రగాఢ విశ్వాసం. హీరోహీరోయిన్లు, దర్శకుడు, టెక్నీషియన్లను తనే పోషిస్తున్నట్టు, వాళ్ల మార్కెట్‌ను తనే పెంచినట్లు ఈయన బిల్డప్. సినిమా అనే కాదు, ఏ వ్యాపారమైనా పరస్పర లాభాపేక్షతోనే నడుస్తుందని వీరికి తెలియదు. ఆధునిక వ్యాపారసూత్రమైన గివ్ అండ్ టేక్ పాలసీని ఈయన లెక్కచేయడు. నిన్న వీరు చేసిన సూత్రీకరణ ప్రకారం, పెద్ద హీరోల సినిమాలకు బడ్జెట్ ఎక్కువగా ఉంటోందని, దాన్ని కాంపన్సేట్ చేయాలంటే టికెట్ ధర పెంచకతప్పదు.
అసలు బడ్జెట్ ఎందుకు పెరుగుతుంది? ‘బాహుబలి’నే తీసుకుందాం. అందులో పెద్ద కాస్టింగ్‌తో పాటు విపరీతమైన గ్రాఫిక్స్ ఉన్నాయి. రాజమౌళి తీసే గ్రాఫిక్స్‌కు చాలా ఖర్చవుతుంది. హీరోహీరోయిన్లు, టెక్నీషియన్ల పారితోషికంతో పాటు నిర్మాణ వ్యయం విపరీతం. దాదాపు రెండు సినిమాలకు కలిపి ఐదేళ్ల సమయం, ఓ ఆయిదువందల కోట్ల బడ్జెట్. మరి అదే ‘మహర్షి’కి ఎంతయింది? 150 కోట్లని చెబుతున్నారు. ఇందులో మహేశ్‌బాబుకు ఓ 25 కోట్లు, వంశీ (దర్శకుడు)కి ఓ 10 కోట్లు, హీరోయిన్‌కు ఓ రెండు కోట్లు..ఇంకా టెక్నీషియన్లు, ఇతర సిబ్బందికి ఓ 10 కోట్లు.. ఇక్కడే ఓ 50 కోట్లు హాంఫట్. సినిమాకు ఓ 30 కోట్లు. 150 కోట్లన్నది ఉత్తమాటే. ఇదంతా ఎవరు పెట్టమన్నట్లు? ప్రేక్షకుడికి ఏమైనా సంబంధముందా దీన్లో? మరి ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు టికెట్ల ధరలు పెంచుకుంటూ పోతే… ఎవడబ్బ సొమ్యు? ఎగ్జిబిటర్లకు వర్కవుట్ కాదంటాడు ఆయన. ఎవరు ఎగ్జిబిటర్? మళ్లీ ఈయనే. రెండు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లు మొత్తం దిల్‌రాజు, అల్లు అరవింద్, సునిల్ నారంగ్ చేతుల్లోనే ఉన్నాయి. సినిమానో 140 కోట్లకు అమ్ముకున్నారు. అక్కడే దాదాపు ఓ యాభై వేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ధరలపెంపు పేరుతో ఇంకా బొక్కాలని చూస్తున్నారు. ఇదెక్కడి న్యాయం?
అప్పుడెప్పుడో రాజశేఖర్‌రెడ్డి టైంలో, ధరలు పెంచుకోవచ్చని కోర్టు ఉత్తర్వులిచ్చిందని, దానికి ప్రభుత్వానికి సంబంధం లేదని ఈయన వక్కాణించారు. అంటే, వీళ్లు వెయ్యి కోట్లతో సినిమా తీస్తే, టికెట్ ధర వెయ్యి రూపాయలు పెడతారా? ప్రభుత్వంతో మాటమాత్రమైనా చర్చించకుండా, ఏదో ఓ కాగితం పట్టుకుని, మేం పెంచుతాం అంటే ఏంటి? ఇలా చేస్తున్నారు కాబట్టే, పైరసీ భూతం ఊడలు పెంచుకున్న వటవృక్షంలా ఎదిగింది. టికెట్ ధరలు అందుబాటులో ఉంటే ఏ ప్రేక్షకుడైనా థియేటర్‌లోనే సినిమా చూడాలనుకుంటాడు. ఎంత పెద్ద టీవీ అయినా, టాకీస్‌లో చూసిన అనుభూతి రాదు కదా.
ఎంత మంచి సినిమా అయినా, 50రోజలు కూడా ఆడడంలేదని రాజుగారి ఆవేదన. బాగుంటే ఎందుకు ఆడదు? ఒక మామూలు డబ్బింగ్ సినిమా ‘బిచ్చగాడు’ ఇక్కడ శతదినోత్సవం చేసుకుంది. ఎలా? అద్భుతమైన కంటెంట్ ఉంది కాబట్టి. రెండు వేలు, మూడువేల థియేటర్లలో విడుదలచేసి, రోజుకు 7 షోలు వేస్తే ఎలా ఆడతాయి? అంటే సినిమా ఫలితం ఎలా ఉన్నా, వారంరోజుల్లో మొత్తం డబ్బు ప్రేక్షకుల నుంచి లాగేయ్యాలి. ఇదీ లక్ష్యం. అప్పడు సినిమా బాగోగులతో సంబంధం ఉండదు. బ్రహ్మోత్సవం, ఆగడు, అజ్ఞాతవాసి లాంటి భయంకరమైన సినిమాలు కూడా నిర్మాతను నష్టపరచలేదు. ఇప్పుడు ఎంత వసూలు చేసిందనేదే వాదన. ఇక శతదినోత్సవాలు, గోల్డెన్ జూబ్లీలు ఎక్కడ?. ఇదే మహేశ్‌బాబు సినిమాలు ఇంకో మూడు పోతే, ఇదే దిల్ రాజు బాబుగారికి ఎంతిస్తాడు? అసలు ఎలా మాట్లాడతాడో ఊహించడానికి మనం పెద్దగా కష్టపడక్కర్లేదు. ఇక్కడ ఎప్పటికీ ప్రేక్షకుడే కింగ్, కింగ్‌మేకర్. ఈ విషయం మర్చిపోతే, రామానాయుడైనా, రాఘవేంద్రరావయినా, చిరంజీవైనా ఇంతే…
- రుద్రప్రతాప్