సిగ్నల్స్ దగ్గర పూలమ్మిన అమ్మాయి.. నేడు కాలిఫోర్నియా యూనివర్శిటీలో పీహెచ్‌డీకి అర్హత..!  

-

ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర పూలు అమ్మే అమ్మాయి..పేదరికం తనను ఆ పనిచేయించింది.. కానీ మనసులో పెద్ద చదువులు చదవాలనే కోరిక ఉండేది.. నాన్న తెచ్చిన పూలు మాలలుగా కట్టి.. సిగ్నల్ దగ్గర బండ్లు ఆగగానే వాటిని అమ్మేది. ఏ రోజైనా రూ. 300 వచ్చాయంటే అది తనకు పండగే.. త్వరగా పూలు అమ్మితే స్కూల్ కు వెళ్లొచ్చు అనే చిన్న ఆశ.. ఇలాంటి స్థితిలోంచి.. నేడు పీహెచ్‌డీ చేయడానికి అర్హత సాధించే స్థాయికి ఎదిగింది. తన బాల్యంలో ఎదురైన ఒడిదొడుకులు, ఈ స్థాయి వరకూ రావడానికి తను పడ్డ కష్టాలు..నేడు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తాయి. చిన్న కష్టానికే హోప్ వదిలేసుకునే వాళ్లు ఈమె కథను కచ్చితంగా చదవాల్సిందే..!
ముంబయి పారిశ్రామిక వాడ ఘట్‌కోపర్ కు చెందిన కుటుంబం.. నలుగురు పిల్లల్లో సరిత పెద్దది. చెల్లి, ఇద్దరు తమ్ముళ్లు, అమ్మానాన్న అందరూ ఒకే చిన్న గదిలో ఉండేవారు. ఉత్తర్‌ప్రదేశ్‌, జౌన్‌పుర్‌కు చెందిన ఈ కుటుంబం బతుకుతెరువు కోసం ముంబయికి చేరింది. సరిత తండ్రి పూల వ్యాపారం చేసేవాడు. పిల్లలను బాగా చదివించాలని అనుకునే వారు. మున్సిపల్‌ స్కూల్‌లో పిల్లలను చేర్పించారు. తరగతులు పెరుగుతున్న కొద్దీ పుస్తకాలు వంటివి కొనుక్కోవాలంటే నాన్నను అడగడానికి సరిత ఇబ్బంది పడేది. దాంతో ప్రైవేట్లు చెప్పేది. తండ్రి ప్రోత్సాహంతో తన సంపాదనలో కొంత పొదుపు చేసేది.
ఇంటర్‌ కొచ్చేసరికి తన ఫీజులు తానే చెల్లించుకునే స్థాయికి చేరింది. కేజే సోమయ్య కాలేజీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది.. హిందీ సాహిత్యంపై మక్కువతో జేఎన్‌యూలో ప్రవేశపరీక్ష రాసి సీటు సాధించింది. అక్కడ హిందీ సాహిత్యంలో ఎంఏ చేసింది. దాతల సాయంతో ఈ యూనివర్శిటీలో పీజీ చేసే అవకాశం దక్కడం తన జీవితాన్ని మార్చేసింది అంటుంది సరిత.
‘సిగ్నల్స్‌ దగ్గర చిన్న పిల్లలు పూలు అమ్ముతున్న దృశ్యం ఎప్పుడు చూసినా.. తన బాల్యమే గుర్తొస్తుందట.. అందుకే నా కాళ్లపై నేను నిలబడ్డాక వీధిబాలలకు విద్యనందించాలని నిర్ణయించుకున్నా అంటోది మన సరిత. హిందీ సాహిత్యమంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండటంతో..ఎంఏ చేసి. తర్వాత పీహెచ్‌డీ చేయడానికి కాలిఫోర్నియా విశ్వ విద్యాలయానికి దరఖాస్తు చేసుకొని అర్హత సాధించినట్లు సంతోషంగా చెప్తుంది సరిత..
మురికివాడలో పెరిగి, పూలు అమ్ముతూ చదువుపై ఆసక్తితో ఉన్నత విద్యాభ్యాసం చేయడానికి విదేశం చేరుకున్న నన్ను చూసి నా తోబుట్టువులకు కూడా చదువుపై ఆసక్తి పెరిగింది. మేమందరం పెద్ద చదువులు చదవాలి. అమ్మానాన్నలకు అండగా నిలిచి వాళ్లు గర్వపడేలా ఎదగాలనేది తన కోరికగా చెప్తుంది 28 ఏళ్ల సరిత. జేఎన్‌యూ నుంచి ఎమ్‌ఏ, ఎమ్‌ఫిల్‌ పట్టభద్రురాలైన సరిత అక్కడ ఉన్న పిన్న వయస్కురాళ్లలో ఒకరు కావడం ఇంకో విశేషం.
మనం పుట్టిన స్థితి మన చేతుల్లో ఉండదు.. కానీ ఎలా జీవించాలి అనేది మాత్రం మనమే డిసైడ్ చేసుకోవచ్చు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఏదో ఒకటి తీసుకోమన్నీ మనల్నీ ఎప్పుడూ చిన్న చిన్నపిల్లలు అడుగుతూనే ఉంటారు. అలాంటి వారిలోంచి వచ్చిన సరిత నేడు ఈ స్థాయికి ఎదుగుతుందని ఎవరూ ఊహించి ఉండరేమో కదా..!
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news