తెల్ల మచ్చలు: క్యాన్సర్ మన శరీరంలో ఏ భాగానికి అయినా రావొచ్చు.. పైగా క్యాన్సర్ వ్యాధి ప్రాణాంతకమైనది. క్యాన్సర్లలో రెటినోబ్లాస్టోమా అనేది ఒక రకమైన క్యాన్సర్. ఇది కంటికి వచ్చే క్యాన్సర్. ఇది ముఖ్యంగా చిన్న పిల్లలను చాలా ప్రభావితం చేస్తుంది. అందుకే రెటినోబ్లాస్టోమా గురించి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం ఈ క్యాన్సర్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం..!
క్యాన్సర్లో భాగంగా కంటిలోని రెటీనా భాగంలో ఉన్న కణాలు నియంత్రణ లేకుండా పెరిగిపోతాయి. అవి కాంతిని గుర్తించే కణాలు.. వాటినే ప్రభావితం చేస్తుంది ఈ క్యాన్సర్. ఇది వచ్చిన పిల్లల్లో కంటిలోని నల్ల గుడ్డుపై తెల్లటి మచ్చ వస్తుంది..ఫ్లాష్‌ని ఉపయోగించి తీసే ఫోటోల్లో ఇలా ఎక్కువమందికి కళ్ళల్లో తెల్లటి మచ్చ పడడం జరుగుతుంది. అలాంటి మచ్చలు కళ్లలో ఉంటే అది క్యాన్సర్ కావొచ్చు.
లక్షణాలు
కేవలం కంటి మధ్యలో తెల్లటి మచ్చ ఉండడం మాత్రమే కాదు.. ఇంకా అనేక లక్షణాలు ఉన్నాయి..
మెల్లకన్ను వచ్చినా, కనుపాప రంగులో మార్పులు కనబడినా, కళ్ళు ఎరుపెక్కినా లేదా వాపు వచ్చినా, కళ్ళు ఎలాంటి కారణం లేకుండా నొప్పి పెడుతున్నా, అసౌకర్యంగా అనిపిస్తున్నా వెంటనే నేత్ర వైద్యులను సంప్రదించాలి.
చూపులో మార్పులు వచ్చినా కూడా అది ఈ క్యాన్సర్ లక్షణం కావచ్చు.
ఎప్పటికప్పుడు పిల్లల్ని కంటి చూపు ఎలా ఉందో ప్రశ్నించడం మంచిది.
మసకబారినట్టు, ఎదురుగా ఉన్న వస్తువులు కనిపించకపోవడం వంటివి ప్రమాదకరమైన లక్షణాలు.
ఎందుకు వస్తుంది?
ఈ క్యాన్సర్ పిల్లల్లో ఎప్పుడైనా రావచ్చు. ముఖ్యంగా ఇది వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది. జన్యుపరమైన కారణాలవల్ల పిల్లల్లో ఎప్పుడైనా ఇది దాడి. చేస్తుంది. అలాగే నెలలు నిండకుండా పుట్టే శిశువులు, రేడియేషన్ బారిన పడిన పిల్లల్లో ఇది అభివృద్ధి చెందుతుంది.
చికిత్స ఎలా ఉంటుంది..?
నేత్ర వైద్యులు కంటికి కాన్సర్ నిర్ధారించేందుకు కొన్ని రకాల పరీక్షలు చేస్తారు. ముఖ్యంగా అల్ట్రాసౌండ్, MRI వంటి పరీక్షలు చేస్తారు. క్యాన్సర్ ఏ దశలో ఉందో ముందుగా గుర్తించి ఆ తర్వాత చికిత్స ప్రారంభిస్తారు.. కీమోథెరిపీ, రేడియేషన్ థెరపీ వంటివి చేస్తారు.. ఈ క్యాన్సర్ కంటి భాగంతోనే ఆగిందా లేక శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించిందా అనే అంశాలపై కూడా చికిత్స ఆధారపడి ఉంటుంది. ఈ క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే చూపు దక్కుతుంది.. లేదంటే చూపు కోల్పోవాల్సి వస్తుంది. చిన్నపిల్లల ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు శ్రద్ధ ఉండాలి.