సంక్షేమ పథకాల అమలు విషయంలో కొంత ఆలస్యం అవ్వొచ్చు కానీ, చేసి తీరుతామని వ్యవసాయ, చేనేత, టెక్స్ టైల్స్ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మీరు కోరుకున్నట్టే ఖమ్మం జిల్లాలో మార్పు వచ్చిందని తెలిపారు. ఈ మార్పుకి గల కారణం మీరు అని అన్నారు. అశాంతి పాలన,అవినీతి పాలన,నిర్బంధ పాలన, నియంత పాలనను ప్రజలు తరిమికొట్టారని అన్నారు. ఈనాడు ఉద్యోగులతో పెట్టుకోలేదు, మీ విషయాల్లో తల దూర్చలేదని క్లారిటీ ఇచ్చారు.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఆధ:పాతాళానికి వెళ్లడం మీరు చూస్తున్నారని అన్నారు. అనవసర ఖర్చులు మానేసి ప్రజావసరాలు తీరేలా చేసి పరిపాలన కొనసాగిస్తామన్నారు. దేశంలోనే అన్ని వనరులున్న రాష్ట్రం మన తెలంగాణ అని తెలిపారు. కాని పాలనా పరమైన ఇబ్బందుల వల్ల రాష్ట్రం గాడి తప్పిందన్నారు. అయినా మంత్రులం అంతా కలిసి పని చేస్తూ కొన్ని రోజుల్లోనే మీరు శభాష్ అనేలా పాలన కొనసాగిస్తామన్నారు. తప్పకుండా మీ న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తానని తెలిపారు. ఇటీవల ఎన్నికల్లో తనని గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు మీ వద్దకు వచ్చానని అన్నారు.