ఏపీ అసెంబ్లీలో గందరగోళం చోటు చేసుకుంది. వ్యవసాయ మోటార్లకు మీటర్ల అంశంపై టీడీపీ నిరసన చేపట్టి… చర్చకు డిమాండ్ చేసింది. ఈ తరుణంలోనే.. ఏపీ స్పీకర్ సీతారం పోడియాన్ని చుట్టుముట్టారు టీడీపీ సభ్యులు.. దీంతో 11 మంది టీడీపీ సభ్యులను ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు ఏపీ స్పీకర్. అయితే.. వ్యవసాయ మోటార్లకు మీటర్ల అంశంపై ఏపీ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
వ్యవసాయ విద్యుత్ మీటర్ల వల్ల 33 శాతం విద్యుత్ ఆదా అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. శ్రీకాకుళంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు స్మార్ట్ మీటర్లు కాదు డిజిటల్ మీటర్లు మాత్రమేనని… పైలట్ ప్రాజెక్టుగా ఆ ప్రాంతంలో డిజిటల్ మీటర్లు బిగించామని వెల్లడించారు.
మీటర్లు బిగించటం వల్ల దాదాపు 33 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఆదా అయ్యిందని.. వ్యవసాయ విద్యుత్ మీటర్ల వల్ల 33 శాతం విద్యుత్ ఆదా అయినట్టు తేలిందని వెల్లడించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. టీడీపీ, కమ్యూనిస్టులు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.. రాష్ట్రంలో 10 వేల మంది మినహా 18 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని తెలిపారు. రైతులకు 9 గంటల పగటి పూటే ఉచిత విద్యుత్ ఇస్తున్నామని.. కేవలం గృహ వినియోగదారులకు మాత్రమే స్మార్ట్ మీటర్లు పెట్టాలని భావిస్తున్నామన్నారు. వ్యవసాయం దండగ అని చంద్రబాబు అన్న విషయాలను రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదని స్పష్టం చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.