గుజరాత్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మోర్బి జిల్లా హల్వాద్‌లోని ఉప్పు ఫ్యాక్టరీలో గోడ కూలి 13 మంది కార్మికులు మృత్యవాత పడ్డారు. దాదాపు 30 మందికి పైగా కూలీలు శిథిలాల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ఈ మేరకు సమాచారం అందుకున్న సహాయక బృందం.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటివరకు 13 మంది మృతదేహాలను బయటకు తీయగా.. శిథిలాల కింద మరికొంత మంది మృతదేహాలు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
జేసీబీ, మ్యాన్ పవర్ సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను అప్పటికప్పుడే ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. అయితే మధ్యాహ్న సమయం కావడంతో కూలీలందరూ తినడానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే గోడ కూలి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. అయితే, ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.