కేరళలోని కాసరగోడ్ జిల్లాలోని అనంతపుర అనే గ్రామంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని శాఖాహార మొసలి బబియా మరణించింది. ఆలయం దగ్గరున్న చెరువులో బబియా నివాసముండేంది. భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ మొసలి కేవలం అన్నం మాత్రమే తినేది. అయితే ఆ ఆలయంలోకి మొసలి ఎలా వచ్చిందనే విషయంపై ఎవరికీ క్లారిటీ లేదు. దానికి బబియా అనే పేరు ఎవరు పెట్టారో కూడా తెలియదు.
ఇన్నేళ్లుగా ఆలయంలో ఉంటున్న బబియా ఎవరితోనూ క్రూరంగా ప్రవర్తించలేదని ఆలయ పూజారి చెబుతున్నారు. చెరువులో ఉంటున్నా.. చేపలకు కూడా హాని కలిగించలేదని ఆయన తెలిపారు. రోజుకు రెండు పూటలా అన్నం తింటుందని, ఒక్కోసారి తానే స్వయంగా అన్నంను ముద్దలా చేసి నోటికి అందిస్తానని పూజారి పేర్కొన్నారు. పురాణాల ప్రకారం, అనంత పద్మనాభ స్వామి మూలస్థానం తిరువనంతపురమేనని స్థానికులు తెలిపారు. బబియా ఆలయ సంరక్షకురాలని ఇక్కడి భక్తుల నమ్మకం.