పంజాబ్ లో రాజకీయ వేడి రాజుకుంటుంది. క్రమంగా ఎన్నికల ప్రచారం ఊపందుకొంటుంది. కాంగ్రెస్ తో పాటు ఆప్, బీజేపీ, అకాళీ దళ్, అమరిందర్ సింగ్ పార్టీ అయిన పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీలు మెల్లగా తమ ప్రచారాల జోరు పెంచుతున్నాయి. ముఖ్యంగా ఆప్ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పంజాబ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. పంజాబ్ లో ఆప్ ను గద్దెనెక్కించేందకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.
వినూత్న హామీలు ఇస్తూ ఓట్లను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు కేజ్రీవాల్. తాజాగా మహిళా ఓటర్లను ఆకట్టుకునేలా హామీ ఇచ్చారు. పంజాబ్ లో తాము అధికారంలోకి వస్తే 18 ఏళ్లు పైబడిన ప్రతీ మహిళకు ప్రతీ నెల రూ.1000 ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు సహాయాన్ని ప్రకటించిన ఢిల్లీ సిఎం “ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా సాధికారత కార్యక్రమం అని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం పంజాబ్ చేరుకుని తన `మిషన్ పంజాబ్`ను ప్రారంభించారు. వచ్చే ఏడాది 2022లో పంజాబ్ తో సహా మరో 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగనున్నాయి.