భారత్ లో విదేశీ ప్రయాణికులకు మళ్లీ ఆ రూల్స్‌..?

-

చైనా, అమెరికా వంటి దేశాల్లో కరోనా కేసులు పెరిగిపోతున్న వేళ భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిపై ఎప్పటికప్పుడు కేంద్ర సర్కార్ చర్యలు చేపట్టింది. వైరస్‌ వ్యాప్తిపై ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తున్నామని చెప్పిన కేంద్రం.. అన్ని రాష్ట్రాలకు ఇప్పటికే సూచనలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చైనాతోపాటు కొవిడ్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రయాణికులకు గతంలో విధించిన ‘ఎయిర్‌ సువిధ’  నిబంధనలను మళ్లీ ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తోంది.

ప్రయాణానికి 72 గంటలకు ముందు ఆర్టీ-పీసీఆర్‌ పరీక్ష లేదా వ్యాక్సిన్‌ వివరాలు పొందుపరిచే స్వీయ ధ్రువీకరణను విదేశీ ప్రయాణికులకు తప్పనిసరి చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, పరిస్థితులను కొన్ని రోజులపాటు పరిశీలించిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి.

ఇతర దేశాల్లో కొవిడ్‌ పెరుగుతోన్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమయంలో విదేశీ ప్రయాణికులకు ఎటువంటి నిబంధనలు వర్తింపజేయాలనే విషయాన్ని చర్చించారు. ఎయిర్‌పోర్టుల్లో ర్యాండమ్‌ పద్ధతిలో కొవిడ్‌ టెస్టులు చేయడం వంటి అంశంపైనా నిపుణులతో చర్చలు జరిపారు. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం కొవిడ్‌ శాంపిళ్లను ఇన్సాకాగ్‌  ల్యాబ్‌లకు పంపించాలని అన్ని రాష్ట్రాలకు సూచించారు. వీటితోపాటు థర్మల్‌ స్క్రీనింగ్‌ అమలు చేసే విషయాన్ని ప్రస్తావించినట్లు ఆరోగ్యశాఖ నిపుణులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version