దమ్ముంటే మీ ముఖ్యమంత్రిని రమ్మను… కూసే వైసీపీ గాడిదలను రమ్మను… ఏపీలో నా వారాహిని ఆపండి… అప్పుడు నేనేంటో చూపిస్తా అంటూ మంత్రి అంబటి ఇలాకాలో జనసేనాని పవన్ కల్యాణ్ నిప్పులు చెరగడం తెలిసిందే. సత్తెనపల్లిలో కౌలు రైతు భరోసా యాత్ర అనంతరం నిర్వహించిన సభలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై అంబటి రాంబాబు ట్విట్టర్ లో వెంటనే స్పందించారు. మేము కాదు గాడిదలం… బాబును మోసే నువ్వే పెద్ద అడ్డగాడిదవి పవన్ కల్యాణ్ అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే.. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించారు. ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబసభ్యులకు చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ధూళిపాళ్లలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. పోరాటం చేయనిదే మార్పు రాదని, ఈ విషయాన్ని జనసేన నేతలు గుర్తుంచుకోవాలని సూచించారు. అధికార పీఠంలో కూర్చోవాలని ఉవ్విళ్లూరు ప్రతి జనసేన నాయకుడు బాధ్యతగా పనిచేయాలని అన్నారు. కేసులు పెడతారని భయపడొద్దని, ధైర్యంగా నిలబడాలని ఉద్బోధించారు. “నేను చెబుతున్నాను కదా… నా మీద లాఠీ పడితే రక్తం చిందించడానికైనా సిద్ధంగా ఉన్నాను. జైల్లో కూర్చోవడానికి కూడా వెనుకాడను. నా సినిమాలు ఆపేస్తావా… ఆపేసుకో. నన్ను ఏమీ చేయలేవు. నువ్వు కొట్టే కొద్దీ పైకి లేస్తాను తప్ప కిందపడేదిలేదు” అని స్పష్టం చేశారు.