బీజేపీ నేత పీవీఎన్ మాధవ్, ఏపీలో జనసేన-బీజేపీ భాగస్వామ్యంపై సంచలన వ్యాఖ్యలు చేపట్టారు . జనసేనతో పొత్తు ఉన్నా లేనట్టేనని అన్నారు. ఏపీలో పేరుకే రెండు పార్టీల మధ్య పొత్తు అన్నట్టుగా పరిస్థితి తయారైందని తెలిపారు మాధవ్.
ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థికి జనసేన మద్దతు ఉందని ప్రచారం జరిగిందని, దీన్ని ఖండించాలని తాము జనసేన నాయకత్వాన్ని కోరామని, కానీ వారు ఖండించలేదని మాధవ్ పేర్కొన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కలిసి రావడం లేదు అనేది బీజేపీ ఆరోపణ అని అన్నారు. జనసేన, బీజేపీ కలసికట్టుగా ప్రజల్లోకి వెళితేనే పొత్తు ఉందని నమ్ముతారని స్పష్టం చేశారు మాధవ్.
మాధవ్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇటు జనసేన నేతలు కూడా గట్టిగానే స్పందించారు. మాధవ్ ఓడిపోతే పొత్తు లేనట్టు.. గెలిస్తే ఉన్నట్టా అని.. జనసేన పార్టీ నేత శివ శంకర్ మండిపడ్డారు. తాము పదే పదే చెబుతున్నా.. రాష్ట్ర బీజేపీ నేతలు తమతో కలిసి రావడం లేదని.. ఆ విషయం పవన్ కళ్యాణ్ కూడా స్పష్టంగా చెప్పారని తెలిపారు. ఇక.. తమ పొత్తు రాష్ట్ర బీజేపీతో కాదని.. కేంద్ర నాయకత్వంతో తమ పొత్తు ఉందని.. జనసేన పార్టీకి చెందిన మరో నేత కిరణ్ రాయల్ తెలిపారు. వీరే కాకుండా.. జనసేన నేతలు వరుసగా స్పందిస్తున్నారు. దీంతో ఏపీ రాజకీయం మళ్లీ వేడెక్కింది.