ఏలూరులో సిద్ధం సభ నిర్వహించడం కోసం 20 రోజుల పాటు ఇంటర్మీడియట్ పరీక్షలను వాయిదా వేయాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం దారుణమని రఘురామకృష్ణ రాజు గారు మండిపడ్డారు. ఒక రాజకీయ పార్టీ సభ నిర్వహించుకోవడం అనేది ప్రభుత్వానికి సంబంధం లేని అంశమని, కేవలం సభ నిర్వహణ కోసమే ఇంటర్మీడియట్ పరీక్షలను వాయిదా వేయడం అన్నది ఎంత దారుణమో ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. వ్యవస్థలన్నింటినీ ఇంతలా దుర్వినియోగం చేస్తున్న వైకాపా ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు.
సిద్ధం… సిద్ధం అంటూనే రోజుకు ఒక అభ్యర్థి పేరును మార్చి వేస్తున్నారని, నరసాపురం నియోజకవర్గ వైకాపా అభ్యర్థిగా తొలుత తమ్మయ్య గారి పేరు ఖరారు చేసినట్లు చూశాం అని, ఆ తర్వాత సాక్షి మీడియాలో పనిచేసిన ఒక యాంకర్ పేరు వినిపించిందని, ఇప్పుడేమో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని పోటీ చేయమని అడిగారట అని, ఆయన ఏమన్నారో ఇంకా తెలియదని అన్నారు. తనపై అభ్యర్థిని పోటీ పెట్టడానికి ఇలా రోజుకొక పేరును పరిశీలిస్తున్న వైకాపా నాయకత్వం, ఏలూరు సభలోనైనా అభ్యర్థిని ప్రకటించాలని రఘురామకృష్ణ రాజు ఛాలెంజ్ విసిరారు.