ఏలూరు: మరోసారి వాలంటీర్ వ్యవస్థ పై కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తనకి వాలంటీర్ వ్యవస్థ పై ఎటువంటి కోపం లేదని.. వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు దేశం ఆగిపోలేదని అన్నారు. ఆ వ్యవస్థ లేనప్పుడు రేషన్ వస్తువుల పంపిణీ ఆగిపోలేదన్నారు. తల్లి సాక్షిగా చెబుతున్నా.. వాలంటీర్ల పొట్ట కొట్టాలని తనకు లేదన్నారు. జనవాణిలో వాలంటీర్లపై ఎన్నో ఫిర్యాదులతో వచ్చాయని తెలిపారు పవన్ కళ్యాణ్. ఆడపిల్లల్ని ఇబ్బందులు పెడుతున్నారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని అన్నారు.
నేషనల్ క్రైమ్ రికార్డ్ ప్రకారం 29,279 వేలమంది మిస్సింగ్ అయ్యారని అన్నారు. ప్రతి 50 ఇళ్ల గుట్టు ఒకరి చేతిలో పెడుతున్నారని.. పెగాసిస్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుతున్నప్పుడు పర్సనల్ వివరాలు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. తనకి వందల కోట్లు ఇస్తాం, వ్యాపారాలు చేసుకుందాం అని.. రాజకీయాలు వద్దని చెప్పిన వాళ్ళు ఉన్నారని తెలిపారు పవన్ కళ్యాణ్. కానీ రాజకీయాలలో మార్పు కోసమే తాను జనసేన పార్టీని పదేళ్ల నుండి నడిపిస్తున్నానని అన్నారు. ఇక సీఎం వైఎస్ జగన్ పై తనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదన్నారు. వైసీపీ విధానాలపైనే తనకు చిరాకుగా ఉందన్నారు.