ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్.. కొన్నాళ్ల కిందటి వరకు ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి రాజకీయ వస్తువు..! దీనిలో కులాన్ని ఆపాదిస్తున్నారనే వాదనను పక్కన పెడితే.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు జరిగిన అన్యాయంపై టీడీపీ ప్రధాన ప్రతిపక్షం పాత్ర పోషించిందనే చెప్పాలి. ఆయనను పదవి నుంచి అనూహ్యంగా తప్పించడం, నిమ్మగడ్డ స్థానంలో కనగ్‌రాజ్‌ను నియమించడం వంటివి రాజకీయంగా చంద్రబాబు వాడుకున్నారు… నిమ్మగడ్డకు అండగా కూడా నిలిచారు. ఇంత వరకు బాగానే ఉంది. నిమ్మగడ్డ కూడా టీడీపీ విషయంలో అప్పట్లో చాలానే జాలి చూపించారన్న ప్రచారమే ఎక్కువుగా జరిగింది.
స్థానిక ఎన్నికల్లో ఈ ఏడాది మార్చిలో ప్రతిపక్ష నేతలపై దాడులు జరిగాయని.. ఇంత క్రూరంగా జరుగుతాయని అనుకోలేదని పేర్కొంటూ.. కేంద్రానికి ఆయన లేఖరాశారు. అంటే.. ఇటు టీడీపీ.. అటు నిమ్మగడ్డలు (రాజకీయ విషయాన్ని పక్కన పెట్టి) సాను భూతి కోణంలో పరస్పరం సహకరించుకున్నారనేది సుస్పష్టం. సరే! ఎట్టకేలకు నిమ్మగడ్డ తిరిగి ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. కట్ చేస్తే.. ఇప్పుడు చంద్రబాబు కోరుతున్నట్టే.. రాష్ట్రంలో నిమ్మగడ్డ టెర్మ్ ఉన్నప్పుడే.. స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు న్యాయపరమైన ఇబ్బందులు లేవని, పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలని నిమ్మగడ్డ పేర్కొన్నారు. అంతేకాదు, తాము ఎన్నికలకు ఎందుకు రెడీ అయ్యామో.. కూడా వివరించారు. ఏపీలో కరోనా ఉధృతి తగ్గిందని, కరోనా కేసుల సంఖ్య 10 వేల నుంచి 753కి తగ్గిపోయిందన్నారు. ఎన్నికల నిర్వహణ రాజ్యంగపరమైన అవసరమని అన్నారు. ఇదే సమయంలో నిమ్మగడ్డ రెండు కీలక అంశాల విషయంలో నిమ్మగడ్డ వెల్లడించిన అభిప్రాయం.. ఇప్పుడు చంద్రబాబుకు కలుక్కుమంటోంది.
దీనిలో ఒకటి.. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడం వెనుక ప్రభుత్వం పాత్ర ఉందని నిమ్మగడ్డ జగన్ సర్కారుకు కితాబు నిచ్చారు. వాస్తవానికి జగన్ సర్కారు నుంచి అనేక అవమానాలు ఎదుర్కొన్నది నిమ్మగడ్డేనని చంద్రబాబు గతంలో స్పష్టం చేశారు. ఇప్పుడు ఈయన జగన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న సందేహాలు టీడీపీలోని కొందరి నుంచి వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో లేదని, నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని వెల్లడించడం. అంటే మొత్తానికి ప్రభుత్వానికి అనుకూలంగా నిమ్మగడ్డ ఎక్కడో యూటర్న్ అయ్యారనే భావన టీడీపీలో కలుగుతుండడం.. దీనిపై బాబు ఆత్మాలోచనలో పడిపోయారని కూడా అంటున్నారు. మరి దీనిపై ఎలా స్పందిస్తారో ? చూడాలి.