ఎన్నికల సమయం దగ్గరపడుతున్నకొద్దీ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసిపిలో ఇంచార్జీల నియామకం అలజడి రేపుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలను సైతం పక్కనబెడుతూ ఆ పార్టీ అధినేత సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో మరోసారి అవకాశం దక్కనివారి అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇలా ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఇతరపార్టీలవైపు చూడగా తాజాగా ఆ జాబితాలో మరో సిట్టింగ్ ఎమ్మెల్యే చేరేటట్లు కనిపిస్తోంది.
అధికార వైసిపి తాజాగా విడుదల చేసిన నాలుగో జాబితాలో చాలామంది సిట్టింగ్ లను పక్కనబెట్టారు. ఇలా తిరువూరు నియోజకవర్గ ఇంచార్జీగా ప్రస్తుత ఎమ్మెల్యే రక్షణ నిధిని కాదని స్వామి దాస్ ను నియమించారు. దీంతో తీవ్ర అసహానికి గురయిన రక్షణనిధి పార్టీకి దూరంగా ఉండననున్నట్లు ప్రకటించారు. అయితే ఆయన టిడిపిలో చేరనున్నట్లుగా ప్రచారం జరుగుతుండగా రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని ఆయన తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని… అయితే ఎక్కడినుండి చేయనున్నానో త్వరలోనే ప్రకటిస్తానని అన్నారు. అలాగే తన భవిష్యత్ రాజకీయాల గురించి సన్నిహితులు, లీడర్లు, క్యాడర్ తో చర్చించి రెండ్రోజుల్లో ప్రకటిస్తానని రక్షణనిధి తెలిపారు.