ఆంధ్రా మరియు ఒడిశా సరిహద్దులలో ఏం జరుగుతోంది ? అసలు ఏం జరుగుతుంది అన్నది అటుంచితే వీటికి సంబంధించి మూలాలు ఎక్కడున్నాయి అన్నది కూడా తెలిసి ఉండేలా పనిచేస్తున్నారా? అయితే వీటిని అడిగితే కోపాలు వస్తుంటాయి కనుక అడగవద్దు.. మన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు ఏం చెప్పినా విని ఊరుకోవాలి మనం అని అంటోంది టీడీపీ.
ఇదేమని ప్రశ్నించం మేం మీరు ఏం చెబితే అది ఉత్తమం అని, మీరేం చేసినా అదంతా ఈ రాష్ట్ర శ్రేయస్సు మరియు ప్రయోజనం కోసమే అని నిర్థారించుకుని కాలం గడిపేస్తాం అని జనసేన అంటోంది. పార్టీలు ఏవయినా వైసీపీని వ్యతిరేకిస్తూ మంత్రులు తిట్టిపోస్తున్నారు.
పార్టీలు ఏవయినా మంత్రివర్గం నిర్ణయాలు బాలేవు అని చెబితే చాలు వ్యక్తిత్వం పై దారుణంగా దెబ్బ కొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇదే ఇప్పుడు రాష్ట్రంలో సరికొత్త చర్చకు తావిస్తోంది.
ఇక కొత్తగా మరోసారి బాధ్యతలు అందుకోనున్న చిత్తూరు పెద్దాయన, పెద్దిరెడ్డి ప్రధాన అనుచరులు, డిప్యూటీ సీఎం నిన్నమొన్నటి వేళ చేసిన వ్యాఖ్యలే పలు వివాదాలకు తావిస్తున్నాయి. సారా రహిత రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ ను చేస్తామని అంటున్నారు. ఇప్పటికే నాటు సారా ప్రభావం కానీ ప్రవాహం కానీ అన్ని దిక్కులా వ్యాపించి ఉందని, దీని కారణంగానే చాలా తగాదాలు పల్లెల్లో జరుగుతూ ఉన్నాయని విపక్షం గగ్గోలు పెడుతోంది.
స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బోర్డ్ (ఎస్ఈబీ) పేరిట చేస్తున్న ప్రయత్నాలు కానీ నిలువరింతకు చేపడుతున్న చర్యలు కానీ ఫలితం ఇవ్వడం లేదని తేలిపోయింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సారారహిత రాష్ట్రమా ఎలా ? మంత్రివర్యులు కాస్త అత్యుత్సాహంతో చెబితే చెప్పారు కానీ విని నిజం అనుకోవడమే సిసలు నేరం.