ఏపీ సర్కార్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసులను ఒక్కొక్కటిగా ఏపీ ప్రభుత్వం ఎత్తివేస్తూ వస్తోంది. అయితే.. అలా ఇష్టానుసారం కేసులు ఉపసంహరించుకుంటే కుదరదని, అది కోర్టు ధిక్కరణే అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా.. సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా వ్యవహరిస్తే కనుక రాష్ట్రంలో ఎంపీ, ఎమ్మెల్యేలపై ఉపసంహరణకు పెండింగులో ఉన్న అన్ని కేసుల్లోనూ స్టే ఇస్తామని హెచ్చరించింది హైకోర్టు. అంతేకాదు, కేసుల ఉపసంహరణ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో నివేదిక ఇవ్వాలని హోంశాఖను ఆదేశిస్తూ విచారణను హైకోర్టు మూడు వారాలు వాయిదా వేసింది. హైకోర్టు అనుమతి లేకుండా మాజీ, ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల ఎత్తివేత కుదరదని గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు.
ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు ఈ హెచ్చరికలు జారీ చేసింది. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై ఉన్న మొత్తం పది కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం జీవో ఇవ్వగా, దానిని సవాలు చేస్తూ ఏపీ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కాగా, ఉదయభానుతోపాటు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విడదల రజిని, మల్లాది విష్ణు, గంగుల బిజేంద్రనాథ్‌రెడ్డి, జక్కంపూడి రాజా, ఎంవీ ప్రతాప్ అప్పారావు, టీటీడీ చైర్మన్, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, వైసీపీ నేతలు సీహెచ్ ద్వారకారెడ్డి, విరూపాక్షి జయచంద్రారెడ్డిపై కేసుల ఉపసంహరణకు ప్రభుత్వం జీవోలు ఇచ్చింది.