సీపీఎస్ రద్దు చేయాలంటూ నేడు యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సీఎంవో ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఛైర్మన్ బొప్పరాజు మాట్లాడుతూ.. మూడేళ్ల కాలం పాటు సీపీఎస్ రద్దు విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపలేదని ఆయన అన్నారు. ఉద్యోగ సంఘాలతో ఎవ్వరూ చర్చలు జరుపుతారనే అంశం పైనా స్పష్టతలేదని ఆయన వెల్లడించారు. సీపీఎస్ రద్దు మినహా ప్రత్యామ్నాయమే లేదని ఆయన వ్యాఖ్యానించారు.
సీపీఎస్ రద్దుపై ప్రత్యామ్నాయం ఉండి ఉంటే.. గత ప్రభుత్వంలోనే సమస్య పరిష్కారం అయి ఉండేదని ఆయన అన్నారు. అంతేకాకుండా సీపీఎస్ రద్దు అంటే ఆర్థిక భారమని ప్రభుత్వమనడం సరికాదని, సీపీఎస్ విషయంలో ప్రభుత్వ ఆలోచనలేంటో మాకు తెలీదని ఆయన అన్నారు. ఛాయ్, బిస్కెట్ మీటింగ్ తరహాలో సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం చర్చలు జరిపితే లాభం లేదని ఆయన స్పష్టం చేశారు. సీపీఎస్ రద్దు అంశంపై సమాలోచనలు. సీపీఎస్ రద్దు అంశంపై ఉద్యోగ సంఘ నేతల నుంచి అభిప్రాయాలను ప్రభుత్వం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.