ఎన్ని చట్టాలు చేసినా.. ఎన్ని కఠిన శిక్షలు వేసినా.. మహిళలు, యువతులపై మాత్రం ఆగంతకుల దాడులు మాత్రం ఆగడం లేదు. అలాంటి ఘటనే ఇది.. ఆటో డ్రైవర్ ఒక యువతిని వేధించాడు. ఆమెను రోడ్డుపై అర కిలోమీటరు దూరం వరకు ఈడ్చుకెళ్లాడు. మహారాష్ట్రలోని థానే నగరంలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం ఉదయం 6.45 గంటలకు 21 ఏళ్ల యువతి నడుచుకుంటూ కాలేజీకి వెళ్తున్నది. రోడ్డు పక్కగా ఉన్న ఆటో డ్రైవర్ ఆమెపై కామెంట్లు చేశాడు. దీంతో ఆ యువతి ఆటో డ్రైవర్‌ను నిలదీసింది. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్ రెచ్చిపోయాడు. ఆమె చేయి పట్టుకుని వేధించాడు. అనంతరం అతడు అక్కడి నుంచి ఆటోలో పారిపోయేందుకు ప్రయత్నించాడు.
అయితే ఆటో డ్రైవర్‌ను నిలువరించేందుకు ఆ యువతి ప్రయత్నించింది. ఈ క్రమంలో అతడి చేతిని గట్టిగా పట్టుకుంది. అయినప్పటికీ అతడు ఆటోను ఆపలేదు. సుమారు అర కిలోమీటరు దూరం వరకు ఆ యువతిని రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. దీంతో ఆమె రోడ్డుపై పడి గాయపడింది. అంతలో ఆటో డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సంఘటన అనంతరం ఆ యువతి పోలీసులకు పిర్యాదు చేసింది. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పారిపోయిన ఆటో డ్రైవర్ కోసం వెతుకుతున్నారు. నిందితుడ్ని గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
On Camera, Maharashtra College Student Molested, Dragged By Auto Driver https://t.co/2bz01Mkg10 pic.twitter.com/EvNPmrcw7L
— NDTV (@ndtv) October 14, 2022