రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్, తెలంగాణలో పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీక్ కాగా, తనను అరెస్ట్ చేయడం, అంతకుముందు టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ తదితర పరిణామాల నేపథ్యంలో ఆయన స్పందించారు. రాష్ట్రము లో ఏ పరీక్ష నిర్వహించినా తప్పుల తడకేనని మండిపడ్డారు. నిరుద్యోగులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీక్ కేసులో మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన సిట్ లు ఏ కేసునూ తేల్చలేదని అన్నారు ఆయన. అవినీతి, తప్పుల నుంచి చేతులు దులుపుకునేందుకే సిట్ ఏర్పాటు అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ అవినీతిపై పోరాడుతున్నామనే, తమపై టెన్త్ పేపర్ లీక్ ఆరోపణలు చేశారని మండిపడ్డారు.
ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా ఇవ్వని దుర్మార్గుడు కేసీఆర్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని అన్నారు బండి సంజయ్. మళ్లీ ఆంధ్ర, తెలంగాణ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందే కేసీఆర్ కు మహనీయులు గుర్తొస్తారని బండి సంజయ్ మండిపడ్డారు. గత ఎన్నికల తర్వాత కేసీఆర్ ఇంతవరకు పీవీ పేరెత్తలేదని తెలిపారు. కేసీఆర్ తొలిసారి నిన్న అంబేద్కర్ జయంతి వేడుకలో పాల్గొన్నారని అన్నారాయన. ఈ నెల 21 పాలమూరు గడ్డపై నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నట్టు బండి సంజయ్ వెల్లడించారు. 10 ఉమ్మడి జిల్లాల్లో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఆ తర్వాత హైదరాబాద్ లో మిలియన్ మార్చ్ ఉంటుందని వెల్లడించారు బండి సంజయ్.