తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసే పనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎప్పటి నుంచో పిలుపు ఇస్తున్నారు బండి సంజయ్. ఆ మేరకు పదవుల కన్నా పార్టీనే మిన్న అన్న పిలుపును కూడా ఉద్ధృతం చేస్తున్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కోటలను ఢీ కొనాలంటే అంతా ఏకతాటిపై రావాల్సిన ఆవశ్యకత గురించి ఎప్పటికప్పుడు ఆయన శ్రేణులను సమాయత్త పరుస్తున్నారు.
ఓ విధంగా పర్సనల్ ఇమేజ్ బాగా ఉన్న నేతలను ఫోకస్ లోకి తీసుకువస్తే పార్టీ బాగుపడుతుందని కూడా భావిస్తున్నారు. ఒకనాడు పర్సనల్ ఇమేజ్ ఎంతో గొప్పగా ఉన్న కిషన్ రెడ్డి ఇప్పుడు ఢిల్లీ రాజకీయాలకే పరిమితం అయ్యారు. మిగిలిన నేతల్లో పర్సనల్ ఇమేజ్ బాగా ఉన్న వారిలో రఘునందన్, ఈటెల రాజేందర్ లాంటి వారిని వాడుకుంటే మేలు అన్న ఉద్దేశంతో బండి కొత్త వ్యూహం ఒకటి సిద్ధం చేస్తున్నారు. వీరితో పాటు వివాదాస్పద ఎమ్మెల్యే రాజా సింగ్ ను కూడా సీన్లోకి తీసుకువస్తున్నారు.
ఇప్పటికే అమిత్ షా ఓ సారి పర్యటించి తనదైన సందేశం ఇచ్చి వెళ్లారు. అటుపై ఆయన మాటల ప్రభావంతో హుజురాబాద్ ఎన్నికల్లో కూడా బాగానే పనిచేసి మంచి మార్కులు కొట్టేశారు బండి. ఇదే స్ఫూర్తితో అలంపూర్ జోగులాంబ ఆలయం నుంచి పాదయాత్ర మొదలు పెట్టనున్నారు. ఓ విధంగా మండుటెండల్లో పాద యాత్ర చేయడం కష్టమే అయినా ప్రత్యర్థి వర్గాలకు దీటుగా పనిచేయడం ఇప్పుడు బండి సంజయ్ ముందున్న తక్షణ కర్తవ్యం. అదేవిధంగా గ్రేటర్ హైద్రాబాద్ లోనూ పార్టీ ఇదివరకటి కన్నా మంచి పేరు తెచ్చుకోవాలన్నా, గొప్ప ఫలితాలు అందుకోవాలన్నా ఇప్పటి నాయకత్వంలో కాస్త మార్పు కూడా అవసరం అని భావిస్తన్నారు. నాయకత్వాన్ని మార్చినా మార్చుకున్నా కార్యాచరణలో మార్పు వస్తే మంచి ఫలితాలు వస్తాయి అన్న వాదన కూడా ఉంది. ఈ దశలో మరికొందరు మంచి నాయకులను పార్టీలోకి తీసుకువచ్చి కాంగ్రెస్ అసంతృప్త వాదులను ఇటుగా తీసుకువచ్చే వీలుందేమో అన్న విషయమై కూడా పరిశీలిస్తున్నారు.అయితే బండి ప్రారంభించే రెండో విడత పాదయాత్రకు అమిత్ షా రారని తెలుస్తోంది. ఆయన వచ్చినా రాకున్నా పాలక పక్షంపై తాము చేయాల్సిన పోరాటం ఎన్నడూ తగ్గదని తెలంగాణ బీజేపీ వర్గాలు పునరుద్ఘాటిస్తున్నాయి.