ఎప్పుడైతే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా…జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారో అప్పటినుంచి..మీడియాలో ఎన్టీఆర్ గురించి ఏదొక కథనం వస్తూనే ఉంది. అంతకముందే టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్‌కు ఇవ్వాలని అభిమానులు…టీడీపీ అధినేత చంద్రబాబుని డిమాండ్ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే షా..ఎన్టీఆర్‌ని కలవడం…రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది.
ఎన్టీఆర్ ద్వారా రెండు రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతానికి షా ప్లాన్ చేస్తున్నారని, ముఖ్యంగా ఏపీలో పార్టీ బలోపేతానికి వాడుకోవాలని చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారం ఏమో గాని…అంతకంటే ఎక్కువగా ఏపీ బీజేపీ నేతలు…ఎన్టీఆర్ పేరుని పదే పదే ప్రస్తావిస్తూ రాజకీయంగా లబ్ది పొందే కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు…బీజేపీ కోసం ఎన్టీఆర్ రంగంలోకి దిగుతారని మాట్లాడుతున్నారు.
ఇటీవల ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అయితే…ఎన్టీఆర్ మావాడు అని, ఆయనకు తెలంగాణ కంటే ఏపీలోనే క్రేజ్ ఎక్కువ ఉందని, ఎక్కడ అవసరం అక్కడ ఎన్టీఆర్‌ని వాడుకుంటామని మాట్లాడుతున్నారు. తాజాగా కూడా టీచర్స్ డే సందర్భంగా కూడా సోము…ఎన్టీఆర్ పేరు తీశారు. జూనియర్ ఎన్టీఆర్ చక్కటి నటుడని, భరత నాట్యాన్ని అభ్యసించాడని, బాల రామాయణం జూనియర్ ఎన్టీఆర్ తొలి సినిమా అని, తాను కళాకారుల గురించి పెద్దగా చెప్పలేనని అన్నారు.
అంటే కళాకారుల గురించి పెద్దగా తెలియదని..ఎన్టీఆర్ గురించి మాత్రం చెప్పుకొచ్చారు. ఏదొరకంగా ఎన్టీఆర్ పేరుని వాడుకుని బీజేపీ లబ్ది పొందాలనే ప్లాన్ వేసిందని, ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. అసలు ఎన్టీఆర్ ఇప్పటిలో రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ లేదని, పైగా ఆయన బీజేపీ వైపుకు వెళ్ళడం జరిగే పని కాదని, కానీ ఆయన ద్వారా ఏదొక లబ్ది పొందాలని బీజేపీ నేతలు ఇలా మాట్లాడుతున్నారని అంటున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకోవడానికి సోము ఇలా పదే పదే ఎన్టీఆర్ పేరు ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది.