సెలబ్రిటీ పార్టీ నాయకుడు బైజూస్‌పై స్టడీ చేసి మాట్లాడాలి : బొత్స

-

టీడీపీ, జనసేన పార్టీలపై మరోసారి విమర్శలు గుప్పించారు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని రాజకీయ పార్టీలకు ఇష్టారాజ్యంగా మాట్లాడటం అలవాటుగా మారిందని , ఇది దురదృష్టకరమన్నారు. ప్రజల కోసమో, రాజకీయం కోసమో ఆలోచించుకుని మాట్లాడాలని మంత్రి బొత్స సూచించారు.

ఈ ప్రభుత్వ ప్రాధాన్యత విద్య అంటూ మంత్రి చెప్పుకొచ్చారు. సెలబ్రిటీ పార్టీ నాయకుడు బైజూస్ మీద మాట్లాడారని.. బైజూస్‌పై స్టడీ చేసి మాట్లాడమని చెప్పానని మంత్రి బొత్స తెలిపారు. బైజూస్ కంటెంట్‌ను ఆ సంస్థ ఫ్రీగా ఇస్తోందని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. ఆ మేరకే ఒప్పందం చేసుకున్నామన్నారు. ఒక్క రూపాయి కూడా బైజూస్ సంస్థకు ప్రభుత్వం చెల్లించటం లేదని పేర్కొన్నారు. బైజూస్ కంటెంట్‌తో 8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు సుమారుగా 5 లక్షలకు పైగా ట్యాబ్స్ అందించామన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో ఇచ్చే ట్యాబ్స్‌లో 8,9,10 తరగతుల కంటెంట్ వేసి ఇస్తున్నామన్నారు.

ఇప్పుడు టోఫెల్ గురించి ఇలానే మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు. దీనిపై బహిరంగ లేఖ కూడా రాశారన్నారు. ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. సుమారుగా 20 లక్షల 70 వేల మంది విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తామని.. ఒక్కో విద్యార్థి పరీక్షకు ఫీజు 7 రూపాయల 50 పైసలు.. ఏడాదికి అయ్యే ఖర్చు సుమారుగా 6 కోట్లు అని మంత్రి తెలిపారు. నిర్ధారిత మార్కులు వచ్చిన వారికి తర్వాతి లెవెల్ పరీక్ష ఉంటుందన్నారు. ఈ పరీక్ష ఫీజు 600 రూపాయలు అని మంత్రి తెలిపారు. దీని తర్వాత స్పీకింగ్ పరీక్ష ఫీజు 2,500 రూపాయలు అని.. 2027-28 వరకు అయ్యే ఖర్చు 145 కోట్లు అని అంచనా వేస్తున్నామన్నారు. ఇంకో ఐదు సంవత్సరాలు ప్రభుత్వం వైసీపీదేనని మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version