కమ్యూనిస్టులకు సీన్ లేదు..కారు నేతల పంచ్.!

-

తెలంగాణలో అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీ, కమ్యూనిస్టులు కలిసి ముందుకెళుతున్న విషయం తెలిసిందే. మునుగోడు ఉపఎన్నిక నుంచి కారు, కమ్యూనిస్టు పార్టీల మధ్య సఖ్యత వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికలో కారుకు కమ్యూనిస్టులు మద్ధతు ఇచ్చారు. దాని వల్ల బి‌ఆర్‌ఎస్ పార్టీ 10 వేల ఓట్ల మెజారిటీతో గెలిచింది. అలా బి‌ఆర్‌ఎస్ గెలుపుకు కమ్యూనిస్టులు సాయపడ్డారు. అయితే కమ్యూనిస్టులతో పొత్తు కొనసాగించాలనేది కే‌సి‌ఆర్ ఆలోచన..ఆ దిశగానే ముందుకెళుతున్నారు.

ఎందుకంటే కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో కమ్యూనిస్టులకు పట్టు ఉంది.ఆ సీట్లలో కారు పార్టీ సత్తా చాటలేకపోతుంది..అందుకే కమ్యూనిస్టులతో కలిసి ముందుకెళ్లాలని డిసైడ్ అయింది. ఖమ్మం జిల్లా లాంటి ప్రాంతాల్లో కమ్యూనిస్టులు కలిసొస్తారనేది కే‌సి‌ఆర్ ఆలోచన. అయితే సి‌పి‌ఐ మాత్రమే కలిసొస్తుందా? సి‌పి‌ఎం కూడా కలిసొస్తుందా? అనేది భవిష్యత్ లో చూడాలి . ప్రస్తుతానికి రెండు పార్టీలు బి‌ఆర్‌ఎస్ పార్టీకి అనుకూలంగానే ఉన్నట్లు కనిపిస్తున్నారు.

అయితే కమ్యూనిస్టులతో పొత్తు ఉంటే ఖచ్చితంగా వారికి కొన్ని సీట్లు ఇవ్వాల్సిన పరిస్తితి. దీంతో కొన్ని సీట్లలో బి‌ఆర్‌ఎస్ నేతలు త్యాగం చేయక తప్పదు. ముఖ్యంగా ఖమ్మం లాంటి చోట్ల. కాకపోతే కొందరు కారు నేతలు కమ్యూనిస్టులకు సీట్లు ఇవ్వడానికి ఇష్టపడటం లేదు..అదే సమయంలో కమ్యూనిస్టులకు గెలిచే సీన్ లేదని మాట్లాడుతున్నారు.

ఈ క్రమంలోనే పొత్తు ఉంటే పాలేరు సీటు తీసుకోవాలని కమ్యూనిస్టులు చూస్తున్నారు. కానీ అక్కడ ఉన్న బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి మాత్రం..మళ్ళీ తానే పోటీ చేస్తానని చెబుతున్నారు. ప్రజలు కమ్యూనిస్టులకు ఓట్లు వేసే రోజులు పోయాయని, ఈ విషయాన్ని ఆ పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాలని ఉపేందర్‌రెడ్డి అన్నారు.

కమ్యూనిస్టులు రెండు రోజులుగా నియోజకవర్గంలో చేస్తున్న జనచైతన్య యాత్రల్లో పాలేరు సీటు తమకే వస్తుందని చెబుతున్నారని, కానీ వారికి ఈరోజుల్లో కూడా ఓట్లు వేసేవారున్నారా అని ప్రశ్నించారు. పాలేరులో తానే పోటీ చేస్తానని, అందరి ఆశీర్వాదం, సహకారంతో గెలుస్తానని చెప్పారు. మొత్తానికి ఇలా కారు నేతలు..కమ్యూనిస్టులని తక్కువ చేసి పంచ్‌లు వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news