ఏపీలో రాజధాని విషయంలో రాజకీయం నడుస్తూనే ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాజధాని అంశం సందిగ్ధంలో పడిపోయిన విషయం తెలిసిందే. వైసీపీ అధికారంలోకి రాగానే మూడు రాజధానులు ప్రకటన చేసింది…అమరావతిని శాసన రాజధానిగా ఉంచేసి..విశాఖపట్నంని పరిపాలన రాజధానిగా, కర్నూలుని న్యాయ రాజధానిగా చేస్తామని జగన్ అసెంబ్లీలో ప్రకటించారు.
కానీ ప్రతిపక్ష టీడీపీ మాత్రం ఒకే రాజధాని అది అమరావతి అనే నినాదం అందుకుంది. అలాగే అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు, ప్రజలు..అమరావతి కోసం ఉద్యమం మొదలుపెట్టారు. ఇక అలా అలా ఈ రాజధాని అంశం మూడేళ్ళ వరకు సాగింది. ఇప్పటికీ రాజధాని విషయంలో రచ్చ నడుస్తూనే ఉంది. అటు మూడు రాజధానులు అమలు అవ్వలేదు. ఇటు అమరావతి రాజధానిగా ఉందని ప్రకటించడం లేదు. కానీ అమరావతి రైతులు మాత్రం తమ ఉద్యమాన్ని ఆపడం లేదు. తాజాగా అమరావతి టూ అరసవెల్లి పాదయాత్ర మొదలుపెట్టారు. ఉత్తరాంధ్ర మీదుగా ఈ పాదయాత్ర జరగనుంది. అయితే ఉత్తరాంధ్రలో పాదయాత్ర జరగనివ్వమని వైసీపీ మంత్రులు ప్రకటన చేస్తున్నారు.
అలాగే జేఏసిలు పేరిట వైసీపీ నేతలు సమావేశాలు ఏర్పాటు చేసి..అమరావతి రైతుల పాదయాత్రని అడ్డుకుంటామని పిలుపునిస్తున్నారు. ఇలా మూడు రాజధానులు అని వైసీపీ, ఒకటే రాజధాని అని టీడీపీ రాజకీయం నడిపిస్తున్నాయి. ఈ రాజధాని అంశాన్ని భుజాన వేసుకుని ఎవరికి వారు రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు. మూడు రాజధానుల ద్వారా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రాజకీయంగా లబ్ది పొందాలని వైసీపీ..అమరావతి ద్వారా కోస్తాలో బెనిఫిట్ పొందాలని టీడీపీ చూస్తున్నాయి.
అయితే ఇప్పుడు అమరావతి రైతుల పాదయాత్ర..ఉత్తరాంధ్ర మీదుగా జరగనుంది. దీంతో అక్కడ అమరావతికి మద్ధతు వస్తే వైసీపీకి ఇబ్బంది. అందుకే అక్కడ అమరావతికి మద్ధతు దక్కకుండా చేయాలని వైసీపీ చూస్తుంది. అందుకే ఎలాగైనా పాదయాత్ర అడ్డుకుంటామని వైసీపీ అంటుంది. మరి ఉత్తరాంధ్రలోకి పాదయాత్ర వెళితే ఎలాంటి రచ్చ జరుగుతుందో చూడాలి.