నేడు గృహ నిర్మాణ శాఖపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, పేదవారి సొంతిళ్ల నిర్మాణంలో ఎలాంటి లోపం ఉండకూడదని స్పష్టం చేశారు. పేదలకు అత్యంత నాణ్యమైన ఇళ్లను అందించాలని ఆదేశించారు. లే అవుట్లలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు. వసతుల ఏర్పాటులో గ్రామ, వార్డు సచివాలయాలు కీలకపాత్ర పోషించాలని దిశానిర్దేశం చేశారు.
అధికారులు బదులిస్తూ… కోర్టు కేసుల వల్ల 30 వేల మందికి ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరిగిందని వివరించారు. ఇప్పటివరకు సుమారు 2.75 లక్షల ఇళ్లు పూర్తిచేశామని వెల్లడించారు. స్లాబ్ దశలో 74 వేల గృహాలు, రూఫ్ దశలో 79 వేల గృహాలు ఉన్నట్టు సీఎంకు వివరించారు. వచ్చే నెలాఖరుకు 5 లక్షల ఇళ్లు పూర్తిచేస్తామని చెప్పారు.