తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి జరుపుకుంటామని ఆయన చెప్పారు. అజ్ఞానాంధకారాన్ని పారదోలి జ్ఞానపు కాంతులు ప్రసరింపజేయాలనే తత్వాన్ని దీపావళి నేర్పుతుందని ఆయన వెల్లడించారు. తెలంగాణ మాదిరిగానే దేశ ప్రజలందరి జీవితాల్లో ఆనందపు ప్రగతి కాంతులు వెల్లివిరియాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. దేశ, రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో, సిరిసంపదలతో తులతూగాలని మనసారా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. మునుగోడు ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అగ్ర పార్టీలు ఆ నియోజకవర్గంలో బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నాయి. ఈనెల 30న మునుగోడు ప్రచారానికి సీఎం కేసీఆర్ రానున్నారని తెలుస్తోంది. ఆరోజు చండూరులో కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్నారని సమాచారం. టీఆర్ఎస్ నేతలు ఇప్పటికే కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రోజే జేపీ నడ్డా రానుండటంతో మునుగోడు ఉప ఎన్నికల హీట్ మరింత పెరిగే అవకాశం ఉంది. కేసీఆర్ చేసే విమర్శలకు నడ్డా కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది.