స్వయంభూ క్షేత్రమైన యాదాద్రి మహాదివ్య క్షేత్ర సందర్శనకు నలుగురు ముఖ్యమంత్రులు కలిసి వస్తున్నారు. పంచనారసింహుల దర్శనం.. వేదాశీస్సుల కోసం బుధవారం తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కేరళ సీఎం పినరయి విజయన్, దిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ పర్యటన సజావుగా సాగేలా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. యాదాద్రి క్షేత్రాన్ని రాచకొండ సీపీ చౌహాన్ మంగళవారం సాయంత్రం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో సమీక్షించారు.హెలిప్యాడ్, ప్రెసిడెన్షియల్ సూట్లు, ఆలయ పరిసరాలను ఆయన నిశితంగా పరిశీలించి ఏర్పాట్లపై ఆలయ ఈవోతో చర్చించారు. బందోబస్తు ఏర్పాట్లపై డీసీపీ నారాయణరెడ్డితో చర్చించి పలు సూచనలు చేశారు. క్షేత్ర పరిసరాల్లో భారీ బందోబస్తు, నిఘా కోసం బలగాలను రప్పించారు.
అయితే.. నేడు ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్ నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకు సీఎం కేసీఆర్ బయలుదేరనున్నారు. రెండు ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా బేగంపేట విమానాశ్రయం నుంచి యాదాద్రి కి ముఖ్యమంత్రులు వెళ్ళనున్నారు. సీఎం కేసీఆర్ వెంట ముఖ్యమంత్రులు పినరయి విజయన్ , కేజ్రీవాల్, భగవంత్ మాన్ సింగ్, యూపి మాజీ సీఎం అఖిలేష్ వెళ్లనున్నారు. 10.30 గంటలకు యాదాద్రి చేరుకోనున్న నలుగురు సీఎంలు.. 10.40 నుండి 11.30 గంటల వరకు యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకోనున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ముఖ్యమంత్రులు ఆలయాన్ని సందర్శించనున్నారు. 11.40 గంటలకు యాదాద్రి నుంచి ఖమ్మం కు నలుగురు సీఎంలు వెళ్లనున్నారు.