మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంతో పాటు, తెలంగాణ బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం వికారాబాద్ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ కాన్వాయ్ కి బీజేపీ శ్రేణులు అడ్డుతగిలారు. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వికారాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్‌కు బీజేపీ నాయకులు అడ్డురావడంపై ఆగ్రహం వెలిబుచ్చారు. బీజేపీ జెండాలు పట్టుకుని నా బస్సుకే అడ్డం వస్తారా? అని మండిపడ్డారు సీఎం కేసీఆర్. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ప్రారంభం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ ప్రజలు మోసపోతే గోసపడే పరిస్థితులు వస్తాయి. వచ్చిన తెలంగాణను మళ్లీ గుంటనక్కలు వచ్చి పీక్కొని తినకుండా, పాత పద్దతికి మళ్లీ పోకుండా, మళ్లీ పరిస్థితులు దిగజారకుండా, వారి రాజకీయ స్వార్థాలకు బలికాకుండా ఈ తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు సీఎం కేసీఆర్.
ఊరికే రాలేదు తెలంగాణ. ఇవాళ ఎవడూ పడితే వాడు అది మాట్లాడుతున్నాడని మండిపడ్డారు సీఎం కేసీఆర్. మన బాధలు చూడననివారు మన అవస్థలు పట్టించుకోనివారు, నవ్విన వారు అడ్డం పొడవు మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ఆనాడు ఉద్యమం జరిగినప్పుడ 14 సంవత్సరాలు పోరాటం చేశాను. చావు అంచు దాకా వెళ్లి ఈ రాష్ట్రాన్ని సాధించానన్నారు సీఎం కేసీఆర్. తెచ్చే వరకు తెచ్చాను. తెచ్చిన తర్వాత మీరు ఆశీర్వాదం ఇస్తే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. ఈ పథకాలన్నీ కొనసాగాలి. పరిశ్రమలు, ఐటీ, వ్యవసాయ రంగాల్లో ముందుకు పోవాలన్నారు సీఎం కేసీఆర్.